కలం, ఖమ్మం బ్యూరో : ఆధునిక యోగంలో సాంకేతికత ఎంత విస్తరిస్తున్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయని నిరూపించే అమానుష ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు (Burgampahad) మండలంలో వెలుగుచూసింది. చేతబడి చేస్తుందనే నెపంతో 70 ఏళ్ల వృద్ధురాలిని (70-Year-Old Woman) తీవ్ర చిత్రహింసలకు గురిచేసిన దారుణ ఉదంతం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది. మండల పరిధిలోని జింకలగూడెం గ్రామానికి చెందిన ఎస్.కే. షకీనా అనే వృద్ధురాలు చేతబడి చేస్తోందని, దానివల్ల ఊరిలో పలువురు ఇబ్బందులు పడుతున్నారనే నెపంతో కొందరు స్థానికులు ఆమెపై విరుచుకుపడ్డారు.
చేతబడి నెపంతో వృద్ధురాలిపై దాడి
ఆమె వయోభారాన్ని కూడా చూడకుండా పట్టుకుని కొడుతూ, బలవంతంగా వేపచెట్టు ఎక్కించారు. అంతటితో ఆగక చెట్టు ఎక్కించే క్రమంలో మేకులు కొడుతూ అత్యంత దారుణంగా హింసించారు. కొద్ది నెలల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇటీవల వాట్సాప్ సహా పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారాయి. ఒక వృద్ధురాలి పట్ల ప్రదర్శించిన ఈ క్రూరత్వాన్ని చూసి నెటిజన్లు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలోనూ ఇంకా ఇలాంటి అజ్ఞానంతో ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటున్న ప్రజలు
ఎవరైనా తప్పు చేసినట్లు అనుమానం ఉంటే చట్టపరంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి తప్ప, సొంతంగా శిక్షించడం అపరాధమని మేధావులు స్పష్టం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా స్థానిక పోలీసులు తక్షణమే స్పందించి, ఈ ఘాతుకానికి ఒడిగట్టిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

