కలం, నిజామాబాద్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ప్రభుత్వం నుంచి సుమారు రూ.25 వేల కోట్ల పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందని బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Builders Association of India) ప్రతినిధులు వెల్లడించారు. ఈ బిల్లుల విడుదల ఆలస్యమవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిజామాబాద్‌లో(Nizamabad) మీడియాతో మాట్లాడిన ప్రతినిధులు, అంతకుముందు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్'(Chalo Hyderabad) సన్నాహక సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ‘చలో హైదరాబాద్’ మహాసభ పోస్టర్‌లను ఆవిష్కరించారు.
రాష్ట్రంలో కాంట్రాక్టర్లు, బిల్డర్ల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన పేర్కొన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అనేక మంది అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అసోసియేషన్ (Builders Association of India) ప్రతినిధులు ప్రకటించారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమం కాదని, కేవలం పెండింగ్ బిల్లుల విడుదల కోసమే ఈ ఆందోళన అని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, బిల్లులు రాక కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు వ్యాఖ్యానించారు. దశల వారీగా పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Read Also: సిలికాన్ వ్యాలీ హైదరాబాద్ తో పోటీ పడుతోంది : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: X(Twitter)

