Mobile Popup Ad
Mobile Popup Ad

ఎయిర్‌పోర్టులో గీజ‌ర్‌ల స‌ర‌ఫ‌రా.. విప్పి చూస్తే షాక్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ఎయిర్‌పోర్టుల్లో భారీ భ‌ద్ర‌త ఉన్నా స్మ‌గ్ల‌ర్లు అక్ర‌మ ర‌వాణాను ఆప‌డం లేదు. ఎలాంటి జంకూ లేకుండా నిషేధిత వ‌స్తువుల‌ను ర‌వాణా చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ (Delhi Airport)లో కస్టమ్స్ అధికారులు ఓ డ్ర‌గ్స్‌ స్మగ్లింగ్ ముఠాను ప‌ట్టుకున్నారు. నిఘా వర్గాల నుండి అందిన సమాచారం ఆధారంగా కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. జూన్ 7న కౌలాలంపూర్ నుంచి ఫ్లైట్ నంబర్ డీ7182 ద్వారా ఢిల్లీ చేరుకున్న ఇద్దరు ప్రయాణికులను గ్రీన్ ఛానల్ దాటిన తర్వాత అధికారులు అడ్డుకున్నారు. సదరు ప్రయాణికులు తమ లగేజీతో పాటు రెండు సరికొత్త వాటర్ గీజర్‌ల‌ను వెంట బెట్టుకుని రావడం అధికారుల దృష్టిని ఆకర్షించింది.

అధికారులు స‌ద‌రు ప్రయాణికులను అడ్డుకొని విచారించారు. ఇద్ద‌రి మొబైల్ ఫోన్లలోని వాట్సాప్ చాట్‌ల‌ను పరిశీలించారు. ఆ చాట‌ల్ ఆధారంగా గీజర్‌ల‌లో ఏదో దాచారనే బలమైన అనుమానం వ్యక్తమైంది. వెంటనే ఆ గీజర్‌ల‌ను ఎక్స్ రే పరీక్షకు పంపించారు. దీంతో లోపలి భాగంలో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు తేలింది. వెంట‌నే అధికారులు ఆ రెండు గీజర్లను విప్పి చూడగా, అత్యంత చాకచక్యంగా అమర్చిన రహస్య అరలు బయటపడ్డాయి. వాటి లోపల వాక్యూమ్ సీల్ చేసిన 145 ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆ ప్యాకెట్లను తెరిచి పరీక్షించగా అందులో పచ్చటి ఆకు కూర లాంటి పదార్థం ఉంది. దీన్ని నాణ్యమైన హైడ్రోపోనిక్ గంజాయి (Hydroponic Cannabis)గా అధికారులు గుర్తించారు.

ఈ సోదాల్లో మొత్తం 15.38 కిలోల బరువున్న హైడ్రోపోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్‌లో దీని అంచనా విలువ సుమారు రూ.5.38 కోట్లు ఉంటుందని కస్టమ్స్ వర్గాలు వెల్లడించాయి. స్వాధీనం చేసుకున్న ఈ నిషేధిత గంజాయిని ఎన్‌డీపీఎస్ చట్టం, 1985 నిబంధనల ప్రకారం సీజ్ చేసినట్లు ఢిల్లీ కస్టమ్స్ విభాగం ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో పట్టుబడిన ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేప‌ట్టారు.

Read Also: సిలికాన్​ వ్యాలీ హైదరాబాద్​ తో పోటీ పడుతోంది : సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>