కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు (Mahabubnagar) జిల్లాలో జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు 1వ తేదీన తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నేమూరి శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా, పార్లమెంట్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన మేడ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా, మహబూబ్ నగర్ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం భారీ ర్యాలీ, బహిరంగ సభ చేపట్టి తమ ప్రజా బలాన్ని చాటనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, నియోజకవర్గ ప్రతినిధులు, వీర మహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
జిల్లా నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన మేడ రామకృష్ణ ఈ ప్రాంత రాజకీయాలకు ‘కొత్త ముఖం’ కావడంతో ఆయన వ్యూహాలపై స్థానికంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. మేడ రామకృష్ణ అంతర్గతంగా ‘చాపకింద నీరులా’ పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెస్తూ, ఇతర రాజకీయ పార్టీల కీలక నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతుండటం స్థానిక రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి రేపుతోంది.
ఈ విస్తృత స్థాయి సమావేశం ద్వారా పాలమూరు జిల్లాలో జనసేన పార్టీ ఉనికిని, ప్రజా బలాన్ని, సేవా సంకల్పాన్ని ప్రజలకు స్పష్టంగా చాటిచెప్తామని పార్టీ నాయకులు వెల్లడించారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా అధ్యయనం చేసి, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజల తరఫున సమరభేరి మోగిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండా ఎగురవేసేలా స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పాలమూరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ విధివిధానాలను రూపొందించి, ప్రజా పోరాటాలను ఉధృతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం సైతం పూర్తి మద్దతు ప్రకటించిందని స్పష్టం చేశారు. ఆగస్టు 1న జరిగే ఈ భారీ సమావేశం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
శుక్రవారం నిర్వహించిన ఈ అత్యవసర సన్నాహక సమావేశంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మేడ రామకృష్ణతో పాటు ముఖ్య నాయకులు వంగా లక్ష్మణ్ గౌడ్, పి.ఆర్. రాఘవేందర్, ముకురాల కృష్ణ, మణికంఠ గౌడ్, రవీందర్ గౌడ్, శ్రీవల్లి, భరధ్వాజ్, బాబు జాగ్జీవన్ (మైక్), డాక్టర్ వి.వి. చారి, ముత్యాల గౌరవ్, ఎద్దుల శ్రీనివాసులు, బాల్ రాజ్ యాదవ్, రవీందర్, కనక దుర్గ, నరేష్, రవి, రామ రాజు, కిషోర్ లాల్, శివ, మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థులు, వీరమహిళలు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

