Mobile Popup Ad
Mobile Popup Ad

బిల్లులు చెల్లించండి.. లేకపోతే ఉద్యమమే: కాంట్రాక్టర్ల హెచ్చరిక

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : రాష్ట్రంలో కాంట్రాక్టర్ల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, ప్రభుత్వం వెంటనే రూ.20 వేల కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Builders Association of India) ప్రతినిధులు డిమాండ్ చేశారు. జూన్ 18న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “మా బిల్లులు – రాష్ట్ర అభివృద్ధి” (చలో హైదరాబాద్) మహాసభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో మహబూబ్‌నగర్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నాయకులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన వివాదాస్పద చెల్లింపు విధానాన్నే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని విమర్శించారు.

పనులు చేయించుకుని బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అప్పుల భారం తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంట్రాక్టర్లు అంతర్జాతీయ స్థాయిలో ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ భవనాన్ని నిర్మించే సామర్థ్యం కలిగిన వారని, కానీ స్వరాష్ట్రంలో తమ బిల్లుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్‌అండ్‌బీ శాఖలోనే సుమారు రూ.3 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో రోడ్డు కాంట్రాక్టర్లు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారని తెలిపారు. బడ్జెట్ పరిమితులను తాము అర్థం చేసుకుంటామని, అయితే అత్యవసర పనులకు ప్రాధాన్యం ఇచ్చి చెల్లింపులు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.

తాము అదనపు లాభాలు కోరడం లేదని, ఇప్పటికే పనుల కోసం పెట్టిన పెట్టుబడులను మాత్రమే తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వీఐపీ సిఫార్సులకు ప్రాధాన్యం ఇవ్వకుండా పాత బిల్ మానిటరింగ్ వ్యవస్థను పునరుద్ధరించి, సీనియారిటీ ప్రకారం బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జూన్ 18న హైదరాబాద్‌లో నిర్వహించే మహాసభ ద్వారా తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వి. రవీందర్ రెడ్డి, డి.వి.ఎన్. రెడ్డి, ఎస్.ఎన్. రెడ్డి, సి.హెచ్. పవన్, జి. సంతోష్ రెడ్డి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>