కలం, వెబ్‌డెస్క్: బడ్జెట్ సమావేశాల్లో (Budget Session) ‘రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం’ సందర్భంగా చెలరేగిన మంటలు చల్లారడం లేదు. ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే ఆత్మకథలోని మాటలను సోమవారం లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తావించడంతో మొదలైన గొడవ బుధవారమూ కొనసాగింది. అధికార, ప్రతిపక్షాల మాటల దాడి, పుస్తకాల ప్రదర్శన, నిరసనలు, పేపర్ చింపి స్పీకర్ కుర్చీ వైపు విసరడం వంటివి గందరగోళం సృష్టించాయి. దీంతో పలుమార్లు వాయిదా పడి, సాయంత్రం 5గంటలకు తిరిగి సమావేశమైనా సభ సజావుగా కొనసాగే పరిస్థితి కనిపించకపోవడంతో గురువారానికి స్పీకర్ వాయిదా వేశారు.
అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో రాహుల్ చేసిన కామెంట్లు మరో వివాదాన్ని రేకెత్తించాయి. వెరసి మొన్న, నిన్నటి కంటే ఈరోజు సభ లోపల బయట రచ్చ రచ్చ అన్నట్లు సాగింది. ఆఖరికి సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం కూడా రద్దు అయ్యింది. ఆయన రేపు సభను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
నెహ్రూ–గాంధీ కుటుంబంపై పుస్తకాలు..
ఉదయం సభ ప్రారంభమైన కాసేపటికే రాహుల్.. నరవణే ఆత్మకథ పుస్తకాన్ని పట్టుకొని మాట్లాడడానికి ప్రయత్నించారు. దీంతో ఆయనకు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇవ్వలేదు. దీనిపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రాహుల్ మాట్లాడనివ్వాలని, సస్పెండ్ చేసిన ఎంపీలను తిరిగి అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎన్డీఏ, ఇండియా కూటమి సభ్యులు ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు.
దీంతో సభ కాసేపు వాయిదా పడింది. అనంతరం తిరిగి సమావేశమయ్యాక బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే.. నెహ్రూ– గాంధీ కుటుంబంపై వచ్చిన.. ఎడ్వినా అండ్ నెహ్రూ, ది రెడ్ శారీ, భోఫోర్స్ గేట్, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తకాలను ప్రదర్శించారు. తానూ వాటి గురించి మాట్లాడతానన్నారు. అయితే, ప్యానెల్ స్పీకర్ తిరస్కరించారు. రూల్ నెం. 349 ప్రకారం.. సభా వ్యవహారాలకు సంబంధంలేని పుస్తకాలు, పేపర్లు, మ్యాగజైన్లు ప్రదర్శించకూడదని వారించారు (Budget Session).
రవ్నీత్పై రాహుల్ వ్యాఖ్యల దుమారం..
అంతకుముందు పార్లమెంట్ బయట.. సస్పెండైన విపక్ష ఎంపీలతో కలసి రాహుల్ ఉండగా, అటువైపు మినిస్టర్ రవ్నీత్ సింగ్ బిట్టూ వచ్చారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న రవ్నీత్ గత ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. ఈ క్రమంలో రవ్నీత్ దగ్గరకు రావడం గమనించిన రాహుల్ ‘మిత్రద్రోహి వచ్చారు’ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నిరసన తెలిపిన రవ్నీత్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే, రవ్నీత్ మీద రాహుల్ చేసిన వ్యాఖ్యలు తెలియడంతో ఎన్డీఏ, బీజేపీ సభ్యులు మండిపడ్డారు. పంజాబ్‌కు చెందిన సిక్కు నేతలు, సిర్సా సభ్యులు పార్లమెంట్ బయట ర్యాలీ చేశారు. సిక్కు నేతను రాహుల్ అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత రవ్నీత్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ మాటలు ఆగ్రహం కలిగించాయన్నారు. తాను మిత్రద్రోహి అయితే, ఆయన దేశద్రోహి అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
Read Also: నంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని హత్య చేసిన యువతి
Follow Us On: X(Twitter)


