కలం, వెబ్ డెస్క్: ఐరోపా ఫుట్‌బాల్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ (UCL) ఫైనల్ సమరానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లోని పుస్కాస్ ఎరీనా వేదికగా శనివారం రాత్రి డిఫెండింగ్ ఛాంపియన్ పారిస్ సెయింట్ జెర్మైన్ (PSG), ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ విజేత ఆర్సెనల్ జట్లు తలపడనున్నాయి. ఫుట్‌బాల్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్.. అత్యుత్తమ ఎటాకింగ్ గేమ్ ఆడే పీఎస్‌జీకి, పటిష్టమైన డిఫెన్స్‌తో దూసుకెళ్తున్న ఆర్సెనల్‌కు మధ్య హోరాహోరీ పోరుగా మారనుంది. స్పానిష్ కోచింగ్ దిగ్గజాలు లూయిస్ ఎన్రిక్, మైకెల్ అర్టెటాల వ్యూహాలకు ఈ మ్యాచ్ ఒక అగ్నిపరీక్ష లాంటిది.
రియల్ మాడ్రిడ్ తర్వాత వరుసగా రెండోసారి యూసీఎల్ టైటిల్ గెలవాలని పీఎస్‌జీ పట్టుదలగా ఉంది. మరోవైపు 22 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ లీగ్ టైటిల్ కరవును ముగించిన ఆర్సెనల్, తమ సుదీర్ఘ చరిత్రలో మొదటిసారి ఈ ట్రోఫీని ముద్దాడాలని చూస్తోంది. గతంలో 2006లో ఫైనల్ చేరిన ఆర్సెనల్, ఈ టోర్నీలో ట్రోఫీ గెలవకుండానే అత్యధికంగా 225 మ్యాచ్‌లు ఆడిన జట్టుగా ఉంది. ఈసారి గెలిస్తే ఆ ముద్రను చెరిపేసి, కప్ గెలిచిన 25వ క్లబ్‌గా ఆర్సెనల్ చరిత్ర సృష్టిస్తుంది.
ఈ సీజన్ ప్రయాణాన్ని గమనిస్తే రెండు జట్ల బలాలు స్పష్టంగా అర్థమవుతాయి. పీఎస్‌జీ ఈ టోర్నీలో ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 44 గోల్స్ చేసింది. బార్సిలోనా పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డుకు ఇది కేవలం ఒక్క గోల్ దూరంలో ఉంది. దీనికి భిన్నంగా ఆర్సెనల్ జట్టు ఇప్పటివరకు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. తమ పటిష్టమైన రక్షణ శ్రేణితో ప్రత్యర్థులకు కేవలం 6 గోల్స్ మాత్రమే ఇచ్చి, 9 మ్యాచ్‌ల్లో క్లీన్ షీట్స్ నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌పై మాజీ భారత ఫుట్‌బాల్ ప్లేయర్ రాబిన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఎస్‌జీ ఆటగాళ్లు డెంబెలే, క్వారత్స్‌ఖేలియా, డిజైర్ డౌల వేగాన్ని అడ్డుకోవడానికి ఆర్సెనల్ కోచ్ అర్టెటా హై-ప్రెస్ గేమ్ ఆడరని ఆయన అభిప్రాయపడ్డారు. డిక్లాన్ రైస్, జుబిమెండీలను డిఫెన్సివ్ మిడ్‌ఫీల్డర్లుగా వాడుతూ పీఎస్‌జీ మిడ్‌ఫీల్డ్ క్రియేటివిటీని దెబ్బతీయడమే ఆర్సెనల్ వ్యూహంగా ఉంటుందని చెప్పారు. పీఎస్‌జీ తరఫున విటిన్హా ఈ సీజన్‌లో అత్యధికంగా 227 లైన్-బ్రేకింగ్ పాస్‌లతో డేంజరస్ ప్లేయర్‌గా మారాడు. గత సీజన్ సెమీఫైనల్లో పీఎస్‌జీ చేతిలో ఓడిపోయిన ఆర్సెనల్ ఇప్పుడు చాలా మారిందని, అందమైన ఆట కంటే సమష్టి రక్షణకే ప్రాధాన్యం ఇస్తోందని ఆయన విశ్లేషించారు.
రెండు జట్లను గాయాల సమస్యలు కూడా వేధిస్తున్నాయి. పీఎస్‌జీ రైట్ బ్యాక్ అష్రఫ్ హకీమి ఆడటం అనుమానంగా మారింది. ఆర్సెనల్‌లో కూడా బెన్ వైట్, జురియన్ టింబర్ గాయాల నుంచి కోలుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ నాకౌట్ దశలో 7 గోల్స్, 3 అసిస్ట్‌లతో అదరగొడుతున్న పీఎస్‌జీ స్టార్ క్వారత్స్‌ఖేలియాను అడ్డుకోవాలంటే టింబర్ ఫిట్‌నెస్ సాధించడం ఆర్సెనల్‌కు ఎంతో ముఖ్యం. క్వారత్స్‌ఖేలియా బంతిని ముందుకు తీసుకెళ్లే నైపుణ్యం ప్రత్యర్థి డిఫెండర్లకు పెద్ద సవాల్ కానుంది.
పీఎస్‌జీకి పెద్ద మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండగా, ఆర్సెనల్‌కు కొత్త ఉత్సాహం తోడైంది. బెంచ్ బలం విషయానికి వస్తే డిఫెన్స్ పరంగా ఆర్సెనల్, ఎటాకింగ్ పరంగా పీఎస్‌జీ బలంగా ఉన్నాయి. 2021 ఫైనల్లో చెల్సియా తరఫున విన్నింగ్ గోల్ కొట్టిన కై హావెర్ట్జ్ ఆర్సెనల్ తరఫున, బ్రాడ్లీ బార్కోలా పీఎస్‌జీ తరఫున సబ్‌స్టిట్యూట్‌లుగా వచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పే అవకాశం ఉంది. మైదానంలో రెండు జట్లు తమ వ్యూహాలతో సర్వశక్తులూ ఒడ్డనున్నాయి. శనివారం రాత్రి బుడాపెస్ట్ వేదికగా జరిగే ఈ మహా సంగ్రామంలో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో చూడాలి.

