కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ నది సుందరీకరణ (Musi beautification) పేరిట రూ.1.50వేల కోట్ల దోపిడీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్వి (BRSV) పోరుబాటకు సిద్ధమైంది. బీఆర్ఎస్‌వీ నాయకులు, కార్యకర్తలు పది బృందాలుగా ఏర్పడి యాభై రోజులపాటు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా శనివారం తెలంగాణ భవన్ నుండి యాత్ర ప్రారంభమైంది. అటు తెలంగాణ భవన్ లో శనివారం బీఆర్ఎస్వి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బాల్క సుమన్ ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఎనలేనిదని.. ఇప్పుడు హైదరాబాద్ పరిరక్షణకు మరోసారి ఉద్యమం చేయాలన్నారు. మూసీ పరిరక్షణ పేరుతో ప్రపంచ బ్యాంకు నుంచి రూ.1,50,000 కోట్ల నిధులు తెచ్చి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందందని ఆరోపించారు. కేసీఆర్ (KCR) హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర రైతులు ఎంతో లబ్ది చెందారని.. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు.
రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Srinivas Yadav)ఫైర్ అయ్యారు. నగరంలో పరివాహక ప్రాంత ప్రజలకు మూసీ పేరిట దోపిడీపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. మలక్ పేట్ నియోజకవర్గంలో 294 నివాసాలు కూలగోట్టారని.. ఇంకా అనేక నివాసాలు కూల కొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఫైర్ అన్నారు. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టే చైతన్య యాత్ర అని పేర్కొన్నారు. బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బుల్డోజర్లకు అడ్డు తగులుతామని స్పష్టం చేశారు.రేవంత్ కుట్రలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్వి కార్యకర్తలు వానరసేనలా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇంటింటికి వెళ్లి మూసి ప్రక్షాళన పేరిట దోపిడీపై ప్రచారం చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగ బాలు (Tunga Balu) మాట్లాడుతూ.. నగరంలో ఒక్క ఇంటిని ముట్టుకున్నా హైదరాబాద్లో తిరగనివ్వమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డిని, మంత్రులను అడుగడుగునా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్క ఇంటిని ముట్టుకోకుండా మూసీ ప్రక్షాళనకు కార్యచరణ సిద్ధం చేశారని చెప్పారు.
రాజేంద్రనగర్ ఇంచార్జ్ పటోళ్ల కార్తీక్ రెడ్డి (Patolla Karthik Reddy) మాట్లాడుతూ.. మూసీ పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దమన కాండకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలన్నారు. ఇప్పటికే రాష్ట్రం దివాలా తీయించారని.. ఇలానే వ్యవహరిస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుందని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే హారర్ సినిమా చూసినట్లే అవుతుందని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భూముల ధరలు తగ్గిపోయాయని.. అమ్మకానికి పెడితే కొనేవాళ్ళు దిక్కులేరని అన్నారు. మూసి నదిని శుద్ధి చేయాలని.. అలా చేయకుండా నదికి ఇరువైపులా ఇల్లు కూలగొట్టడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పరపతి పెరగడానికి ఈ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. రేవంత్ ప్రతిష్ట పెరగడానికి పేదల నివాసాలు కూలకొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీపై ఎన్జిటిలో వేసిన తన పిటిషన్ ను డిస్పోసల్ చేసిందని.. డిస్మిస్ చేయలేదని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టుపై అన్ని అనుమతులు తీసుకోబోతున్నామని ప్రభుత్వం ఎన్జీటీకి తెలిపిందని చెప్పారు. ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాలని ఎన్జిటి సూచించిందన్నారు.

