కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని బీఆర్ఎస్ (BRS) మాజీ మంత్రి హరీశ్ (Harish Rao) రావు మండిపడ్డారు. పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు. వడ్డించే వాడు మనవాడు అయితే లడ్డు ఎక్కడున్నా వస్తుంది అంటరు కానీ, పోలీసు శాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉండి కూడా ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాత్రింబవళ్లు కష్టపడేవారు పోలీసులు అని.. ఈ రాష్ట్రం కోసం, సమాజం కోసం ఎంతో పని చేస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోలీసులను ఎంతో గౌరవించామని చెప్పారు. తమ హయాంలో కొత్త కమీషనరేట్లు ఏర్పాటు చేశామని.. ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేశామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) హయాంలో పోలీసులను పట్టించుకోవట్లేదన్నారు. పోలీసు శాఖలో ఉన్న 17 వేల ఖాళీల భర్తీపై సమాధానం చెప్పాలన్నారు. ఏడు టీఏ బిల్లులు, మూడు సరెండర్ లీవులు, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. పోలీసుల భద్రత పథకాన్ని రూ.లక్షకు మాత్రమే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెం జిల్లాలో 72 టీఏలు పెండింగ్‌లో ఉన్నాయని.. కొన్ని జిల్లాల్లో ఇచ్చి కొన్ని జిల్లాల్లో పెండింగ్ పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని లక్షా 30 వేల మంది పోలీసుల తరఫున తాను మాట్లాడుతున్నట్లు వివరించారు. గత సంవత్సరం కంటే రూ. 400 కోట్ల బడ్జెట్ ఎందుకు తగ్గించారని.. పెంచాల్సిన బడ్జెట్ ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు.
పోలీసుల టీఏలు, డీఏలు, సరెండర్ లీవులు విడుదల చేయనందుకు, పోలీసుల ఆరోగ్య భద్రతా పథకంపై భరోసా ఇవ్వనందుకు, పోలీసు శాఖలో ఉన్న 17 వేల ఖాళీల భర్తీపై సమాధానం చెప్పనందుకు, పోలీసులకు కొత్త వాహనాల విషయంలో సమాధానం చెప్పనందుకు, బీసీల ఆత్మగౌరవ విషయంలో స్పష్టత ఇవ్వనందుకు, బీసీ సబ్ ప్లాన్ నిధుల కేటాయింపుపై వైఖరి చెప్పనందుకు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగుల అపాయింటెడ్ డేట్ చెప్పనందుకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ (BRS Walkout) చేస్తున్నామని స్పష్టం చేశారు.
Read Also: ఉద్యోగం పేరుతో మోసం.. డబ్బులు అడిగితే మహిళపై దాడి
Follow Us On : WhatsApp

