కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డీలిమిటేషన్‌పై (Delimitation) బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటే రాష్ట్రానికి అన్యాయాన్ని జనంలో విస్తృతంగా వివరించేలా ఆలోచిస్తున్నది. పార్టీ అధికార ప్రతినిధుల మీడియా సమావేశాలను, టీవీ ఛానెళ్లలో డిబేట్లలో దీనిపై పార్టీ వైఖరిని వెల్లడించేలా వర్క్ డివిజన్ చేసింది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, సెన్సస్ అంశాలపై లోతుగా స్టడీ చేసి పార్టీ లైన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని భావిస్తున్నది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ అంశాలు ఒకవైపు పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదంటూనే పొలిటికల్‌కగా మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తున్నది. ఏకకాలంలో అటు బీజేపీని, ఇటు కాంగ్రెస్‌ను కార్నర్ చేసేలా వాదనలను వినిపించాలని పార్టీ నేతలకు మెసేజ్ పంపింది. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టి కేంద్రం ఆడుతున్న నాటకాన్ని ఎండగట్టాలని పార్టీ నేతలను ఆదేశించింది.
సెన్సస్ తర్వాతనే డీలిమిటేషన్ జరగాలి
మహిళా రిజర్వేషన్‌కు బీఆర్ఎస్ (BRS) అనుకూలమని, డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా లెక్కల ప్రాతిపదికగా జరగకూడదన్న అంశాలను సూటిగా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళాలని పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చింది. కరోనా కారణంగా ఆగిపోయిన 2021 జనాభా లెక్కల సేకరణను కేంద్ర సర్కార్ ఇంకా పూర్తి చేయలేదని, అది కంప్లీట్ కాకముందే డీలిమిటేషన్‌ను చేపట్టాలన్న నిర్ణయంలోని మతలబేంటో సామాన్యులకు అర్థమయ్యే తీరులో వివరించాలని సూచించింది. మహిళా రిజర్వేషన్ పట్ల బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే డీలిమిటేషన్‌తో, లోక్‌సభ సీట్లతో ముడిపెట్టకుండా ఇప్పుడున్న 543 స్థానాల్లోనే 33% రిజర్వేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. పార్టీ విధానపరంగానే మహిళా రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తున్నదనే అంశాన్ని, గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ప్రజలకు వివరించాలని పార్టీ లీడర్లు, కేడర్‌కు సూచించింది.
డీలిమిటేషన్ సీట్ల పెంపుపై కొరవడిన స్పష్టత
డీలిమిటేషన్ (Delimitation) బిల్లులోని అంశాలను అవగాహన చేసుకుని బీజేపీ నేతలను టార్గెట్ చేసేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. ఎక్కడా 50% సీట్ల పెంపుపై బిల్లులో స్పష్టత లేనప్పుడు బీజేపీ నేతలు ఎందుకు దీన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారనే వైరుధ్యాన్ని ఎత్తి చూపాలని పేర్కొన్నది. బిల్లులో లేని అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ నేతలు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలుచేసి సహకరించినందుకు దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం డీలిమిటేషన్ పేరుతో శిక్షిస్తున్నదనే వైఖరిని కూడా జనంలో వివరించాలని కోరింది. ప్రస్తుతం మొదలైన జనాభా లెక్కల ప్రక్రియ ముగియకుండానే హడావిడిగా డీలిమిటేషన్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో, దీని వెనక ఉన్న మతలబేంటో ఎండగట్టాలని సూచించింది. ప్రస్తుతం లోక్‌సభలో ఐదు దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న 24% నిష్పత్తి ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదని బీజేపీపై ఒత్తిడి పెంచాలని పార్టీ లీడర్లు, శ్రేణులకు వివరించింది.

