హిందూ విద్యార్థులకు కల్మా హోంవర్క్‌లా?: బండి సంజయ్ ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో : హైదరాబాద్ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్‌లో హిందూ విద్యార్థికి ‘కల్మా’ను హోంవర్క్‌గా ఇవ్వడంపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు బలుపెక్కి, బరితెగించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడులకు దిగుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. పాఠశాలల్లో విద్యార్థులతో కల్మా, సూరహ్ ఫతే చదవాలని హుకుం జారీ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఫైర్ అయ్యారు.

సెక్యులర్ సంఘాల స్పందనేది?

ఇలాంటి ఘటనలు జరుగుతుంటే సమాజంలో ఉండే సోకాల్డ్ సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. హిందూ సమాజమంతా ఈ ఉదంతాన్ని ముక్తకంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వమే వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వాటిని చూసీ చూడనట్లు వ్యవహరిస్తే… తెలంగాణ అంతటా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వాళ్లకో న్యాయం? భరత్‌కు ఇంకో న్యాయమా?

ఇదే సమయంలో ఆటో డ్రైవర్ భరత్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ పోలీసులు, మజ్లిస్ నాయకుల తీరును బండి సంజయ్ తప్పుబట్టారు. ”నీ మతాన్ని మార్చుకోవడం అంటే నీ తండ్రిని మార్చుకోవడం లాంటిది” అని ఆటో వెనుక రాసిన డ్రైవర్ భరత్ ను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. భరత్ రాసిన దాంట్లో తప్పేముంది? అని నిలదీశారు. హిందువులను కించపర్చేలా ఉర్దూలో ఆటోలపై, గోడలపై రాసుకునే వాళ్లపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. వాళ్లకు ఒక న్యాయం, భరత్‌కు ఇంకో న్యాయమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ అధికారంలోకి రావడం పక్కా.. బొట్టు తప్పనిసరి చేస్తాం!

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాసంస్థల్లో హిందూ విద్యార్ధులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తామని వెల్లడించారు. విద్యాసంస్థల్లో హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను పక్కాగా పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>