కలం, వెబ్ డెస్క్: నేటి డిజటల్ యుగంలో మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేని కంప్యూటర్ ఉద్యోగాలు, క్షణాల్లో ఇంటికి వచ్చే ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి మన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఈ మార్పులు శారీరక శ్రమను తగ్గించడంతో పాటు మన శరీరంలో నిశ్శబ్దంగా చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol) స్థాయిలను కూడా పెంచుతున్నాయి. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని మీకు తెలుసా?
సాధారణంగా కొలెస్ట్రాల్ అనేది మన కాలేయం సహజంగా ఉత్పత్తి చేసే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలో కణాల నిర్మాణం, హార్మోన్ల ఉత్పత్తి, విటమిన్ తయారీకి చాలా అవసరం. అయితే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే ధమనులలో పేరుకుపోయి గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా నూనె పదార్థాలు, నెయ్యి, వేపుళ్లు మాత్రమే కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని అనుకుంటారు.
కానీ ఆరోగ్యంగా కనిపించే కొన్ని రకాల ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా నిశ్శబ్దంగా చెబు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బేకరి ఉత్పత్తులు
ఈ మధ్యకాలంలో పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, ఉద్యోగ ప్రమోషన్లు.. ఇలా ఏ చిన్న శుభ సందర్భమైనా కేక్ కట్ చేయడం ఒక ఆనవాయితీగా మారింది. అయితే కేక్ మాత్రమే కాదు, బిస్కెట్లు, కుకీలు, పేస్ట్రీలు వంటి బేకరీ ఉత్పత్తులను తినడం కూడా నేడు ఒక అలవాటుగా మారిపోయింది. వీటి తయారీలో వాడే ట్రాన్స్ ఫ్యాట్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను అత్యంత వేగంగా పెంచుతాయని, ఫలితంగా గుండె జబ్బుల ముప్పు ఎక్కువ అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్యాకేజ్డ్ స్నాక్స్
ఈ మధ్యకాలంలో చిప్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, రెడీ టు ఈట్ మిక్స్‌లు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్యాకేజ్డ్ స్నాక్స్ పాడుకాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు, రుచిని పెంచేందుకు తయారీదారులు పామాయిల్ లేదా హైడ్రోజనేటెడ్ నూనెలను ఉపయోగిస్తారు. వీటిలోని శాచురేటేడ్ కొవ్వులు నిశ్శబ్దంగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెబుతున్నారు వైద్యులు.
ఫ్రోజెన్ ఫుడ్స్
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సమయం ఆదా అవుతుందనే ఉద్దేశంతో చాలా మంది ఫ్రీజర్లో నిల్వ ఉండే రెడీమేడ్ పరాటాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, సాసేజ్ లు, నగ్గెట్స్ వంటి మాంసాహార ఉత్పత్తులను వాడుతున్నారు. అయితే ఇవి చెడిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు వీటిలో శాచురేటేడ్ కొవ్వులు, సోడియంను ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. ఇవి శరీరంలో చేరి చెబు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అంతే కాకుండా బీపీ సమస్యలకు కారణమై గుండెపై తీవ్ర ఒత్తిడిని పెంచుతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.
కృత్రిమ తీపి పదార్థాలు
కూల్ డ్రింక్స్, మార్కెట్లో దొరికే ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూసులు, ఐస్ క్రీములలో ఫ్రక్టోజ్ రూపంలో అధిక చక్కెరలు ఉంటాయి. వీటిని తినడం ద్వారా, ఆ అదనపు చక్కెరను కరిగించడానికి కాలేయంపై తీవ్ర ఒత్తిడి పడుతుందట. ఈ క్రమంలో కాలేయం చక్కెరను ట్రైగ్లిజరైడ్స్, చెబు కొలెస్ట్రాల్ గా మారుస్తుంది. ఫలితంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఆరోగ్యంగా కనిపిస్తూనే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచి, గుండె ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీసే ఇటువంటి ఆహార పదార్థాల పట్ల ఎంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

