కలం, ఖమ్మం బ్యూరో : కంటికి రెప్పలా పెంచిన కొడుకు కాసేపట్లో ఇంటికి వస్తాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలను మృత్యువు రోడ్డుపైనే తుంచేసింది. కల్లూరు (Kalluru ) మండలం ఎన్ ఎస్ పీ క్రాస్ రోడ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మెరుగు గోపి (25) వ్యక్తిగత పని నిమిత్తం కల్లూరు టౌన్‌కు వచ్చాడు. పని ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. గోపి బైక్ ఎన్ ఎస్ పీ క్రాస్ రోడ్ సమీపంలోకి రాగానే, అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం అతడి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు గోపి బైక్ పైనుంచి రోడ్డుపైకి విసిరికొట్టబడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
చేతికి అందివచ్చిన 25 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే వార్త తెలియగానే నారాయణపురం గ్రామం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కళ్లముందే తిరిగిన కొడుకు శవమై పడి ఉండటాన్ని చూసి బాధితుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. వారి రోదనలు స్థానికులను సైతం కన్నీరు పెట్టించాయి. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సమాచారం అందుకున్న కల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

