కలం, తెలంగాణ బ్యూరో: జిల్లాల్లో ప్రభుత్వ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయా? అభివృద్ధి పనులు అనుకున్న టైమ్‌లో పూర్తవుతున్నాయా? శాఖలు, విభాగాల మధ్య సమన్వయం ఉంటున్నదా? ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు పరిష్కారమవుతున్నాయా?.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు సంతృప్తికరంగా లేవనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై ఫోకస్ పెట్టాల్సిన జిల్లాల ఇన్ చార్జి మంత్రుల్లో (TG Incharge Ministers) చాలా మంది.. మూడునెలలకోసారి జరిగే డీఆర్సీ మీటింగ్లు కూడా పెట్టడం లేదు. కొందరైతే తాము ఇన్చార్జిగా ఉన్న ఉమ్మడి జిల్లా పరిధిలోని కొత్త జిల్లాల్లో పర్యటించిందీ లేదు. దీంతో ఆఫీసర్లు కూడా పట్టీపట్టనట్లుగానే ఉంటున్నారు. శాఖల మధ్య కోఆర్డినేషన్ లేక పనులు పెండింగ్లో పడిపోతున్నాయి. ప్రజా సమస్యలు అటకెక్కుతున్నాయి.
సంక్షేమ, అభివృద్ధి పనులు సమర్థవంతంగా అమలు కావాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రుల్ని నియమించింది. గత బీఆర్ఎస్ హయాంలో ఈ వ్యవస్థ సక్రమంగా అమలు కాలేదని, ఇక నుంచి జిల్లాల్లో ‘ప్రజాపాలన’ కార్యలాపాలను సమీక్షించడంతో పాటు సమర్థవంతంగా అమలు చేయించడం ఇన్చార్జి మంత్రుల తక్షణ బాధ్యత అని స్పష్టం చేసింది. పది ఉమ్మడి జిల్లాలకు 2023 డిసెంబర్ 24న ఇన్చార్జి మంత్రులను నియమించగా.. ఆ తర్వాతి సంవత్సరం మంత్రివర్గాన్ని విస్తరించడంతో ముగ్గురు పాత మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించింది.
మొత్తం పది ఉమ్మడి జిల్లాలకు పది మంది ఇన్ చార్జి మంత్రులు (TG Incharge Ministers) ఉన్నప్పటికీ ఆయా జిల్లాలను వారు సరిగ్గా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో ‘ఇన్ చార్జి మంత్రి వచ్చేది ఉందా? ‘డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ’ మీటింగ్ లు పెట్టేది ఉందా? అయినా మనకెందుకులే..’ అనుకుంటూ జిల్లా స్థాయి అధికారులు ఎవరి పనుల్లో వారు ఉండిపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గ్రామీణ రహదారులు, తాగునీటి పనులు, విద్య, వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో ఆఫీసర్ల మధ్య సమన్వయం లేక ఫైళ్లు మూలుగుతున్నాయి. వారిని కోఆర్డినేట్ చేస్తూ.. పనులు చకచక జరిగేలా చూడాల్సిన ఇన్ చార్జి మంత్రి పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతుందన్న అభిప్రాయాలూ ఉన్నాయి.
ప్రతీ మూడు నెలలకోసారి.. ఆనవాయితీ
ప్రభుత్వ లక్ష్యాలు, విధాన నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి వీలుగా జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రుల (TG Incharge Ministers) వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. కనీసంగా ప్రతీ మూడు నెలలకు ఒకసారి జిల్లాల్లో అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుని ‘డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ’ పేరుతో సమీక్ష నిర్వహించడం ఆనవాయితీ.
అటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రులు సైతం అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును సమీక్షించాలని, ప్రజల అభిప్రాయాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కార మార్గాలను అన్వేషించాలని చాలాసార్లు కలెక్టర్ల కాన్ఫరెన్సుల్లోనూ సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇన్‌చార్జి మంత్రులు నియమితులైన తర్వాత ఆ జిల్లాల్లో రివ్యూ మీటింగులు మొక్కుబడిగానే జరిగాయి. కొద్దిమంది మంత్రులు రివ్యూ మీటింగులు పెట్టినా వారి శాఖల పరిధిలోని అంశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి ఏ లక్ష్యంతో ఇన్‌చార్జి మంత్రుల వ్యవస్థను పునరుద్ధరించారో అది నెరవేరడంలేదన్నది పలువురు ఎమ్మెల్యేల వాదన.
మొక్కుబడిగా..!
జిల్లా స్థాయిలో పనులు, పథకాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నియమించిన ఇన్‌చార్జి మంత్రుల రివ్యూలు మొక్కుబడిగానే నడుస్తున్నాయి. కేబినెట్ సమావేశాల్లో లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నా, కలెక్టర్ల సమావేశాల్లో శాఖల పనితీరుపై దిశానిర్దేశం చేస్తున్నా మంత్రులు వారి శాఖల సమీక్షలకే పరిమితమవుతున్నారు.
మంత్రులే అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో అధికార వర్గాల్లోనూ అలసత్వం వ్యక్తమవుతున్నది. జిల్లాల్లో కలెక్టర్, వివిధ విభాగాల అధికారులతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్ సమస్యలు, శాఖల మధ్య సమన్వయం, సమీక్షించడం ఇన్‌చార్జి మంత్రుల ప్రధాన బాధ్యత అయినా అలాంటి సమీక్షలు నామమాత్రమే. వరదలు, భారీ వర్షాలు, ప్రకృతి విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో జరిగిన ప్రత్యేక సమావేశాలను మినహాయిస్తే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జరిగిన రివ్యూ, కోఆర్డినేషన్ సమావేశాలు తక్కువే.
శాఖల మధ్య కొరవడిన కోఆర్డినేషన్
కొన్ని జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రులు అప్పుడప్పుడు అభివృద్ధి పనులపై సమీక్షలు నిర్వహించినా.. అన్ని జిల్లాల్లో ఒకే తీరులో అమలు కావడంలేదు. చాలా సందర్భాల్లో కలెక్టర్లే వివిధ విభాగాల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇన్‌చార్జి మంత్రి పాత్ర లేకపోవడంతో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండడంలేదు. జిల్లాలో ఏ పథకం ఎక్కడ నిలిచిపోయింది.. ఏ శాఖలో సమస్య ఉంది.. ఏ పనికి నిధుల కొరత ఉంది.. ఏ అధికారి బాధ్యతలు ఎలా ఉన్నాయి.. ఇలాంటి అంశాలను సమన్వయం చేసి నిర్ణయాలు తీసుకోవడం ఇన్‌చార్జి మంత్రుల బాధ్యత.
అయితే.. వారి సమీక్షలు మొక్కుబడిగా సాగడంతో అధికారులు వారి శాఖలకే పరిమితమవుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గ్రామీణ రహదారులు, తాగునీటి పనులు, విద్య, వైద్యం, వ్యవసాయం, రెవెన్యూ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు జిల్లా స్థాయిలో సమన్వయం లేనందున ఫైళ్లు పెండింగ్‌లో పడుతున్నాయి. సమస్యలు నెలల తరబడి కొనసాగుతూ ఉన్నాయి.
ముఖ్యమంత్రి చెప్పినా బేఖాతర్
జిల్లాలకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పినప్పుడే ఆరు గ్యారంటీలు, ప్రజాపాలన అమలుపై దృష్టి పెట్టాలని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆయా జిల్లాల అధికారుల సమాచారం ప్రకారం.. చాలా జిల్లాల్లో ఒకటి రెండుసార్లు మాత్రమే ఇన్‌చార్జి మంత్రుల అధ్యక్షతన డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగులు జరిగాయి. మిగిలిన సందర్భాల్లో నిర్దిష్టంగా స్కీమ్‌ల అమలు, అభివృద్ధి పనుల ప్రోగ్రెస్‌పైనే జరిగాయి. తొలుత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖకు ఇన్‌చార్జి మంత్రుల బాధ్యతలు అప్పజెప్పినా ఆ తర్వాత వాటిని కొత్త మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌కు బదిలీ చేశారు. కొందరు మంత్రుల జిల్లాలు మారాయి. పలువురు మంత్రులు తాము ఇన్-చార్జిగా ఉన్న జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు మాత్రమే సమీక్షించడం, పర్యవేక్షించడం వంటివి చేస్తున్నారనే.. ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
జిల్లాలకు ఇన్-చార్జ్ మంత్రులు వీరే
ఉమ్మడి జిల్లా మంత్రి
ఆదిలాబాద్ జూపల్లి కృష్ణారావు
నిజామాబాద్ సీతక్క
కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు
వరంగల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం వాకిటి శ్రీహరి
నల్లగొండ అడ్లూరి లక్ష్మణ్
మహబూబ్నగర్ దామోదర రాజనర్సింహ
మెదక్ వివేక్ వెంకటస్వామి
రంగారెడ్డి శ్రీధర్ బాబు
హైదరాబాద్ పొన్నం ప్రభాకర్

