కలం, వెబ్ డెస్క్ : పిఠాపురం (Pithapuram) నియోజకవర్గంలోని మూలపేట గ్రామంలో దారుణ ఘటన వెలుగుచూసింది. తన చెల్లిని వేధిస్తున్న యువకులను నిలదీసినందుకు, ఒక అన్నను కిరాతకంగా ప్రాణాలు తీశారు. అమ్మమ్మ అంత్యక్రియల కోసం వచ్చిన ఒక యువకుడు ఇలా శవమై తిరిగొస్తాడని ఊహించని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… పెదపూడి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన రాకేష్ (28) తన అమ్మమ్మ మరణించడంతో అంత్యక్రియల కోసం మూలపేట గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో స్థానిక ఒక దుకాణం వద్ద రాకేష్ చెల్లితో కొందరు స్థానిక యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ విషయం తెలిసిన రాకేష్.. నా చెల్లిని ఎందుకు కామెంట్ చేశారంటూ సదరు యువకులను నిలదీశాడు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.
ఈ గొడవ మనసులో పెట్టుకున్న వంశీ అనే యువకుడు, తన మరో నలుగురు స్నేహితులతో కలిసి రాకేష్‌పై పగ పెంచుకున్నాడు. అనంతరం అమ్మమ్మ ఖననం కోసం రాకేష్ శ్మశాన వాటికకు వెళ్లిన సమయంలో, ఒంటరిగా ఉన్న అతడిని లక్ష్యంగా చేసుకుని వంశీ గ్యాంగ్ ఒక్కసారిగా చాకులతో దాడికి తెగబడింది. రాకేష్‌పై విచక్షణారహితంగా పొడవడంతో అతడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు.
తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను స్థానికులు వెంటనే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి చేరకముందే రాకేష్ మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

