దశాబ్దాల కలకు టేకాఫ్.. ఉత్తర తెలంగాణకు ఆకాశమే హద్దు!

కలం, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన మామునూరు ఎయిర్‌పోర్టు (Mamnoor Airport ) పునరుద్ధరణకు కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఇటీవల జరిపిన చర్చలు సానుకూలంగా ముగియడంతో ప్రాజెక్టు పనుల్లో వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.

తొమ్మిది దశాబ్దాల చరిత్ర

మామునూరు విమానాశ్రయానికి దాదాపు 90 ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1930లో వరంగల్ సమీపంలోని మామునూరులో విమానాశ్రయం నిర్మించారు. సుమారు 1,875 ఎకరాల్లో ఏర్పాటైన ఎయిర్‌ఫీల్డ్ దేశంలోని అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. రెండు రన్‌వేలు, పైలట్ శిక్షణ కేంద్రం, టెర్మినల్ భవనం, సిబ్బంది నివాసాలు వంటి సౌకర్యాలు ఇందులో ఉండేవి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యం కూడా వినియోగించుకుంది. 1959లో ప్రధాని నెహ్రూ విమానంలో వచ్చి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ(ప్రస్తుత ఎన్‌ఐటీ వరంగల్)కు శంకుస్థాపన చేశారు. 1962 భారత్–చైనా యుద్ధ కాలంలోనూ భారత వైమానిక దళం కూడా వినియోగించుకుంది. 1981 తర్వాత విమాన సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం కొంతభాగం ఎన్‌సీసీ శిక్షణ కేంద్రంగా ఉంది.

ఉడాన్ పథకానికి ఎంపిక

మామునూరు విమానాశ్రయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకంలో చేర్చింది. దీంతో 2023లో తెలంగాణ మంత్రివర్గం కూడా విమానాశ్రయ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. 2024లో అదనపు భూసేకరణకు నిధులు విడుదల చేసింది. ఇటీవల సేకరించిన భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి అప్పగించారు. ప్రస్తుతం 696 ఎకరాల భూమి ఉండగా, అదనంగా మరో 200 ఎకరాలు సేకరించారు. దీంతో నిర్మాణ ప్రక్రియలో వేగం అందుకుంది. 2028 జూన్ 2 న మామునూరు నుంచి విమాన సేవలు ప్రారంభించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.

ఓరుగల్లు అభివృద్ధికి కొత్త ఊపు

మామునూరు విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపు లభించనుంది. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌తో పాటు ఇతర పారిశ్రామిక ప్రాజెక్టులకు వేగవంతమైన విమాన సౌకర్యం కలుగుతుంది. ఉత్పత్తుల దిగుమతి, ఎగుమతులు సులభం కానున్నాయి. రామప్ప దేవాలయం, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం వంటి పర్యాటక ప్రాంతాలకు దేశ విదేశాల నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఐటీ, విద్య, వైద్య రంగాలతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు కూడా విమానాశ్రయం ఉపయోగపడనుంది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ధర్మసాగర్‌లో ప్రతిపాదిత అంతర్జాతీయ క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికీ ఇది కీలకంగా మారనుంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మామునూరు విమానాశ్రయం నుంచి తొలి విమానం ఎగిరే రోజు కోసం ఇప్పుడు వరంగల్ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రెండు దశాబ్దాల కిందే పునరుద్ధరణ ప్రయత్నం

ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2007లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుని విమానాశ్రయ పునరుద్ధరణకు ప్రయత్నం జరిగింది. అయితే శంషాబాద్ విమానాశ్రయం అభివృద్ధి సందర్భంగా జీఎంఆర్‌తో కుదిరిన ఒప్పందంలో 150 కిలోమీటర్ల పరిధిలో మరో వాణిజ్య విమానాశ్రయం అభివృద్ధి చేయరాదనే నిబంధనతో ప్రాజెక్టు ముందకు సాగలేదు. అనంతరం కేంద్రం ఆ పరిమితిని సడలించడం, జీఎంఆర్ నుంచి అభ్యంతరం లేకపోవడంతో మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణకు ఆమోదం లభించింది. కాగా, మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణతో ఉత్తర తెలంగాణకు వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇది ఉమ్మడి వరంగల్ తో సహా ఉత్తర తెలంగాణ ప్రాంత పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్ధికి కొత్త రెక్కలు ఇవ్వనుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>