కాంగ్రెస్ పై సమరానికి BRS కొత్త వ్యూహం

కలం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్న బీఆర్ఎస్ (BRS) ప్రజాందోళనలపై దృష్టి పెట్టింది. మరోవైపు బహిరంగసభల ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా కార్యాచరణ సిద్ధం చేసింది. రాష్ట్రంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ డిక్లరేషన్లను ప్రకటించిందో అక్కడే కౌంటర్ డిక్లరేషన్ సభలను నిర్వహించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఫస్ట్ బహిరంగసభను మే 6న వరంగల్‌లో నిర్వహిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 మే 6న ‘రైతు డిక్లరేషన్’ను కాంగ్రెస్ విడుదల చేసింది. ఆ డిక్లరేషన్‌లో రైతులకు హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయబోయే పథకాలను వివరించింది. ఇప్పుడు అమలులోకి రాని అంశాలను ఏకరువు పెడుతూ బీఆర్ఎస్ బహిరంగసభను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

రైతు డిక్లరేషన్‌కు కౌంటర్ సభ నుంచి స్టార్ట్ :

బీఆర్ఎస్ (BRS) తలపెట్టిన బహిరంగసభలు వరంగల్ నుంచే మొదలుకానున్నాయి. రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ రైతుల్ని మోసం చేసిందని, రుణమాఫీ సగం మందికే ఇచ్చిందని, రైతుభరోసా అసంపూర్ణంగా అమలైందని, ధాన్యం కొనుగోళ్ళు సక్రమంగా జరగడంలేదని, సన్న బియ్యానికి బోనస్ ఇవ్వడంలేదని.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ (BRS) వరంగల్ సభ ద్వారా ఎక్స్‌పోజ్ చేయాలనుకుంటున్నది. అదే తరహాలో బీసీ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, యువజన డిక్లరేషన్… వీటన్నింటిలోని లోపాలు, అమలులోని వైఫల్యాలను అదే చోట సభలు పెట్టి కాంగ్రెస్‌పైన విమర్శలు చేయాలనుకుంటున్నది. ఈ ప్రోగ్రామ్ చేపట్టడానికి పార్టీ విధాన నిర్ణయం తీసుకున్నా పార్టీ అధినేత కేసీఆర్ హాజరవుతారో లేదో మాత్రం ఇంకా డిసైడ్ చేయలేదు. కాంగ్రెస్ డిక్లరేషన్‌లు ప్రకటించిన చోటనే ఆ పార్టీని ఎండగట్టాలన్నది బీఆర్ఎస్ ఆలోచన.

ఐదు డిక్లరేషన్లను స్టడీ చేసిన బీఆర్ఎస్ :

కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌ను (Rythu Declaration) రాహుల్‌గాంధీ సమక్షంలో వరంగల్‌లో (2023 మే 6న), యువజన డిక్లరేషన్‌ను సరూర్‌నగర్ స్టేడియంలో 2023 మే 8న ప్రియాంకాగాంధీ సమక్షంలో, ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్‌ను మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో చేవెళ్ళలో 2023 ఆగస్టు 26న, మైనారిటీ డిక్లరేషన్‌ను సల్మాన్ ఖుర్షీద్ సమక్షంలో 2023 నవంబరు 9న హైదరాబాద్‌లో, బీసీ డిక్లరేషన్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో 2023 నవంబరు 10న కామారెడ్డిలో కాంగ్రెస్ ఆవిష్కరించింది. సరిగ్గా ఈ వేదికల దగ్గరే బీఆర్ఎస్ ఇప్పుడు డిక్లరేషన్‌లలోని వైఫల్యాన్ని, హామీలు ఇచ్చి అటకెక్కించిందన్న విమర్శలతో కాంగ్రెస్‌ను కార్నర్ చేయాలన్నది బీఆర్ఎస్ లక్ష్యం. ఆరు గ్యారంటీలను సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున్ ఖర్గే చేతుల మీదుగా తుక్కుగూడలో 2023 సెప్టెంబరు 17న నిర్వహించిన ప్రోగ్రామ్‌కు కౌంటర్‌గా బీఆర్ఎస్ కూడా భారీ బహిరంగసభను అదే చోట నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.

Read Also: లండన్‌లో కొడుకు.. పాలేరులో ఇల్లు.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>