కలం, వెబ్‌డెస్క్: విదేశాల్లో ఉండే భారతీయులకు ఇచ్చే ఓసీఐ (OCI) కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఓసీఐ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ఇప్పటి వరకు ఉన్న ఫిజికల్ కార్డులతో పాటు డిజిటల్ రూపంలో ఉండే ఈ ఓసీఐ కార్డులు కూడా ప్రభుత్వం జారీ చేయనుంది. దీని వల్ల పేపర్ వర్క్ తగ్గి, ప్రక్రియ మొత్తం వేగంగా, పారదర్శకంగా జరుగుతుంది.
ఇక మైనర్ల విషయంలో నిబంధనలను కేంద్రం మరింత కఠినతరం చేసింది. ఇండియన్ పాస్‌పోర్ట్ ఉన్న మైనర్‌లు అదే సమయంలో ఇతర దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండరాదు. ఒకవేళ విదేశీ పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకుంటే ఇండియన్ పాస్‌పోర్ట్‌ను వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ పూర్తయ్యేలా ఓసీఐ దరఖాస్తుదారుల వేలి ముద్రలు, కంటి పాప గుర్తులు కూడా సేకరించాలని కేంద్రం నిర్ణయించింది.

