కలం, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో నిర్వహించిన ప్రజాదర్బార్ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు మైక్ ఇచ్చి మాట్లాడమని కోరగా.. ఒక ఇందిరమ్మ ఇళ్ల (Indiramma indlu) లబ్ధిదారు చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది.
పాలేరు గ్రామానికి చెందిన పిల్లి నీలమ్మ అనే మహిళ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలిగా ఎంపికయ్యారు. వేదికపై ఉన్న మంత్రి పొంగులేటి (Minister Ponguleti) ఆమెను ఆప్యాయంగా పలకరిస్తూ పిల్లల వివరాలు ఆరా తీశారు. దీనికి ఆమె స్పందిస్తూ తన నలుగురు పిల్లల్లో ఒకరు లండన్ లో ఉద్యోగం చేస్తున్నారని వివరించారు. మరో కుమారుడు సోషల్ మీడియాలో చాణక్య స్ట్రాటజీస్ నిర్వహిస్తున్నారని.. కూతురు కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తుందని వెల్లడించారు.
పేదల కోసం కేటాయించిన ఇందిరమ్మ ఇల్లు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబానికి దక్కడం సభలో చర్చనీయాంశంగా మారింది. అనర్హులకు పథకాలు అందుతున్నాయనే విమర్శలకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. లబ్ధిదారురాలి మాటలతో ఒక్కసారిగా కంగుతినడం సభికుల వంతైంది.

