మహేశ్ టార్గెట్‌.. అర్బ‌న్ సీట్‌!

కలం, నిజామాబాద్ బ్యూరో: ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పార్టీలో శూన్యత ఏర్పడ్డ చోటు నుంచే భవిష్యత్ రాజకీయ కార్యాచరణ మొదలు పెట్టారు. ఆ నియోజకవర్గాన్నే తన అడ్డాగా మార్చుకొని పోటీకి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. తన సొంత సెగెంట్ తో పాటు గతంలో పోటీ చేసిన వాటిని కాదనుకుని కొత్త స్థానంపై గురుపెట్టారు. పార్టీ వ్యవహారాలతో రాజధానిలో నిత్యం బిజీగా ఉండే మహేశ్ నిజామాబాద్ అర్బన్ (Nizamabad Urban) నియోజకవర్గంలో వారంలో ఒక రోజు పర్యటిస్తున్నారు. కార్పొరేషన్ మీటింగ్ కు సైతం సమయం ఇస్తున్నారు. అభివృద్ధిలో ఏ పార్టీనైనా కలుపుకు పోతానని ఇటీవల సంచలన ప్రకటన చేశారు. నిజామాబాద్ అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీలో ఎన్ఎస్ యూఐ లీడర్ నుంచి పీసీసీ చీఫ్ పదవి వరకూ ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. బీసీ నాయకుడిగానూ గుర్తింపు పొందారు.

సొంత సెగ్మెంట్ కాదనుకుని..

జిల్లాలోని బాల్కొండ సెగ్మెంట్ పరిధిలోని రహత్ నగర్ ఆయన సొంతూరు. అయినప్పటికీ నిజామాబాద్ రూరల్ నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. సొంత నియోజకవర్గమైన బాల్కొండ వైపు ఎన్నడూ చూడలేదు. కాలానుగుణంగా పార్టీలో మారిన రాజకీయ పరిస్థితులతో నిజామాబాద్ అర్బన్ స్థానంపైనే ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారనే చర్చ నడుస్తోంది. ఇపుడు అక్కడ పార్టీలో ఏర్పడ్డ శూన్యతను భర్తీ చేస్తూ పార్టీని పరుగులు పెట్టించి, తన అడ్డాగా మార్చుకునేందుకు చర్యలు చేపట్టారని చర్చలో ఉంది.

అక్కడ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పావులు కదుపుతుండగా.. ఇప్పటికే తన అనుచరులకు ముఖ్యమైన పదవులు కేటాయించారు. అంతేకాదు నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా చర్యలు చేపట్టారు. ఇటీవల మహేష్ తరుచూ అర్బన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ, అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. అక్కడ అన్ని తానై వ్యవహరిస్తున్నారు.

మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుని..

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను చేజిక్కించుకోవడంలోనూ మహేశ్ చక్రం తిప్పారు. బీజేపీ మెజార్టీ కార్పొరేటర్లను గెలుచుకున్నా కానీ.. మేయర్ కుర్చీని ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో మహేష్ కీ రోల్ పోషించారు. అంతేకాదు తన ముఖ్య అనుచరుని భార్యకు మేయర్ పదవిని కట్టబెట్టారు. పార్టీ నుంచి గెలిచిన పాత కాంగ్రెస్ నేతలు ఉన్నప్పటికీ అనూహ్యంగా కొత్త వ్యక్తికి పదవి ఇచ్చి తన మార్క్ చూపించారు. భవిష్యత్ లో ఇక్కడి నుంచే తన రాజకీయ భవిష్యత్ అనే సంకేతాలు ఇచ్చారు. అర్బన్ అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు.

తాను పదవిలో ఉండగానే అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలని, అవసరమైతే బీజేపీని కూడా కలుపుకొని పోవడానికి సిద్ధమయ్యారనే టాక్. అందుకే మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లోనూ ఎమ్మెల్సీ హోదాలో పాల్గొంటూ అభివృద్ధి ప్రణాళికలు చేస్తున్నారు. సిటీ అభివృద్ధికి ఏ పార్టీ నేతలనైనా కలుపుకుపోతా అని తానే స్వయంగా ఇటీవల కౌన్సిల్ మీటింగ్ లో ప్రకటించటం ఇందుకు ఉదాహరణ. బీజేపీ ఎంపీ అరవింద్ ఏర్పాటు చేసిన తన తండ్రి డి.శ్రీనివాస్ విగ్రహానికి ఇటీవల మహేష్ గౌడ్ (Mahesh Kumar Goud) నివాళులు అర్పించారు. మొత్తం మీద ఒక్క ఎన్నికల్లో కూడా గెలవలేడని తనపై ఉన్నవిమర్శను చెరిపేసేందుకు ఇప్పటి నుండే పీసీసీ చీఫ్ పావులు కదుపుతున్నారు. ఇందుకు అర్బన్ నియోజకవర్గమే బెటర్ అని డిసైడ్ అయ్యారు.

షబ్బీర్ అలీ కామారెడ్డికేనా..?

2023లో కామారెడ్డి కాంగ్రెస్ టికెట్ ను ఆశించిన సీనియర్ నేత షబ్బీర్ అలీని (Shabbir Ali) అధిష్టానం నిజామాబాద్ అర్బన్ కు పంపింది. సిటీలోని మైనార్టీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందని ఆశించింది. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీచేయడంతో షబ్బీర్ అలీ అర్బన్ కు వలస వెళ్లక తప్పని పరిస్థితి వచ్చింది. కానీ, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి నిజామాబాద్ లో షబ్బీర్ అలీ ఇద్దరూ ఓడిపోయారు. అయినా ఆయన కొన్నాళ్లు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గానే ఉన్నారు. కొంతకాలంగా షబ్బీర్ అలీ అర్బన్ కు దూరం పాటిస్తున్నారు. మళ్లీ కామారెడ్డిపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. ఇది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోసమే అనే చర్చ కూడా నడుస్తోంది. నిజామాబాబ్ లో స్వయంగా మహేష్ గౌడ్ పోటీకి ఆసక్తి చూపిస్తున్నట్లుగా సంకేతాలు ఇవ్వటంతో షబ్బీర్ ఇక కామారెడ్డిపై దృష్టి పెడుతున్నారు. ఎక్కువగా అక్కడే పర్యటిస్తున్నారు.

ధర్మపురి సంజయ్ పరిస్థితి ?

మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్(డీఎస్) పెద్ద కొడుకు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) పరిస్థితి ఇప్పుడు ఏమిటనే చర్చ మొదలైంది. నిజామాబాద్ లో మహేశ్ గౌడ్ పోటీకి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న క్రమంలో సంజయ్ ఆశలు గల్లంతేనా..! అనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే సంజయ్ 2023లో టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా షబ్బీర్ అలీ రావడంతో టికెట్ దక్కలేదు. ఈసారి కూడా రేస్ లో ఉన్నారు. కానీ సాక్షాత్తూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే పోటీకి వస్తే ఇక ఇంకేముంది టికెట్ కష్టమే అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి గత రెండు సార్లు బీఆర్ఎస్ తర్వాత 2023లో నిజామాబాద్ అర్బన్ లో పార్లమెంట్ లో బీజేపీకి జనాలు పట్టం కట్టినా జిల్లా కేంద్రంపై రానున్న రోజుల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయని చెప్పక తప్పదు.

మూడు దశాబ్దాల కిందనే పోటీ..

1994లో తొలిసారిగా డిచ్ పల్లి అంటే ప్రస్తుత నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అపజయం పాల‌య్యారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఆశించినా టికెట్ ద‌క్క‌లేదు.

Read Also: అడవి లోగిలిలో ప్రకృతి కోలాహలం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>