కలం, వెబ్‌డెస్క్: వైసీపీ హయాంలో తనపై వేధింపులు జరిగాయంటూ కూటమి ప్రభుత్వాన్ని ఆశ్రయించిన ముంబై నటి కాదాంబరి జత్వానీ (Kadambari Jethwani) పై ఏపీ సీఐడీ (AP CID) సంచలన నివేదిక బయటపెట్టింది. నేడు ఏపీ హైకోర్టుకు ఆ నివేదికను అందజేసింది. ఇందులో జత్వానీ ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ అని పేర్కొంది.
విద్యా సాగర్‌ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి తన నుంచి డబ్బులు వసూలు చేసిందని సీఐడీ విచారణలో తేలినట్లు పేర్కొంది. దీనికి సంబంధించి ఆధారాలతో సహా చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ మేరకు జత్వానీపై కేసు నమోదు చేశారు. జత్వానీ తల్లి ఆశ, తండ్రి నరేంద్ర కుమార్, సోదరుడు అంబరీష్‌లకు సీఐడీ క్లీన్ చిట్ ఇచ్చింది. విద్యా సాగర్ ఫిర్యాదుతో సీఐడీ విచారణ ప్రారంభించింది.
2009లో హైదరాబాద్‌లో కుక్కల విద్యాసాగర్‌కు జత్వానీతో పరిచయం ఏర్పడింది. అప్పట్లో సన్నిహితంగా దిగిన ఫోటోలతో జత్వానీ విద్యా సాగర్‌ను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది. విద్యా సాగర్‌పై లైంగిక వేధింపుల కేసు పెడతానంటూ 2013 నుంచే జత్వానీ (Kadambari Jethwani) బెదిరింపులకు దిగినట్లు సీఐడీ విచారనలో తేలింది. దుబాయ్‌లో తనకు పరిచయం ఉన్న అండర్ వరల్డ్ డాన్‌తో చెప్పి చంపిస్తానని హత్యా బెదిరింపులు కూడా చేసినట్లు నివేదికలో అధికారులు పేర్కొన్నారు. విద్యా సాగర్ నుంచి రూ.కోటికి పైగా నగదు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. జత్వానీ కాల్ రికార్డ్స్ కూడా సేకరించారు.
జత్వానీ ఫిర్యాదుతో ఈ కేసుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్‌లపై చర్యలు తీసుకుంది. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన పీఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, అప్పటి విజయవాడ డీసీపీ విశాల్ పై చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కీలక వాస్తవాలు వెలుగులోకి రావడంతో తదుపరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: భూ వివాదంలో చిక్కుకున్న తమ్మినేని.. కేసు నమోదు
Follow Us On : WhatsApp

