కలం, వెబ్ డెస్క్: భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో కలపాలని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (MP Vaddiraju) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు సాకుతో తెలంగాణకు (Telangana) చెందిన ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా అన్యాయంగా ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించారని ఆయన గుర్తుచేశారు. దీనివల్ల భద్రాచలం ఆలయ అభివృద్ధికి, పట్టణ విస్తరణకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా సీతారామచంద్రస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల గ్రామాలను తక్షణమే తెలంగాణలో విలీనం చేయాలని వద్దిరాజు (MP Vaddiraju) విజ్ఞప్తి చేశారు. ఈ గ్రామాలు భద్రాచలం పట్టణంతో విడదీయలేని సంబంధం కలిగి ఉన్నాయన్నారు. వీటిని తిరిగి కలపడం వల్ల ఆలయ పరిసరాల అభివృద్ధికి భూమి అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ వద్దిరాజు కోరారు.
Read Also: ఆర్మీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. రిజిస్ట్రేషన్ గడువు పెంపు
Follow Us On : WhatsApp

