కలం, డెస్క్ : బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) ఐపీఎస్ అధికారుల సంఘానికి క్షమాపణలు చెప్పారు. పోలీసులు అంటే తనకు గౌరవం ఉందని.. తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే వారంతా తనను క్షమించాలని కోరారు. వీణవంకలో జరిగిన మినీ మేడారం జాతరకు తాను వెళ్తే.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే కరీంనగర్ సీపీ గౌస్ తనను అలా జాతర నుంచి వెళ్లగొట్టారంటూ ఆరోపించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఆ కోపంలోనే తాను కరీంనగర్ సీపీని ఒక మాట అన్నానని.. కానీ ఉద్దేశపూర్వకంగా అన్న మాట కాదన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.
అసలేం జరిగిందంటే..?
గురువారం కరీంనగర్ లోని వీణవంక (Veenavanka) గ్రామంలో మినీ మేడారం జాతరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫ్యామిలీ, అనుచరులతో వచ్చారు. జాతర వద్ద దళిత మహిళా సర్పంచ్ తో కొబ్బరి కాయ కొట్టించే క్రమంలో వివాదం చోటు చేసుకుంది. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కౌశిక్ రెడ్డికి పోలీసులు సూచించారు. కానీ కౌశిక్ రెడ్డి అందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనుచరులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కౌశిక్ రెడ్డి తన కుటుంబంతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. కరీంనగర్ సీపీ గౌస్ మతమార్పిడులకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే కరీంనగర్ సీపీ గౌస్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) ఇలా స్పందించారు.
Read Also: మేడారంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్
Follow Us On: Youtube



