కాంగ్రెస్ హయాంలో ఆరోగ్య రంగం పురోగతి నుండి పక్షవాతానికి గురైందని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) అన్నారు. శనివారం మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులతో కలిసి ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ కోసం కేసీఆర్ ప్రణాళిక వేసిన 4 టిమ్స్ ఆసుపత్రులు రెండు సంవత్సరాలుగా నిలిచిపోయాయని మండిపడ్డారు. నగరానికి నాలుదిక్కులా నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆస్పత్రి భవనాలను ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ 90% పనులు పూర్తి చేసినప్పటికీ వరంగల్ హెల్త్ సిటీ అసంపూర్తిగా ఉందని హరీష్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ మంజూరు చేసిన మహేశ్వరం, కుత్బుల్లాపూర్ వైద్య కళాశాలలను కాంగ్రెస్ రద్దు చేసిందని వెల్లడించారు. టిమ్స్ ఎల్బీ నగర్ కోసం రూపొందించిన 6 అంతస్తులు.. కాంగ్రెస్ హయాంలో 2 సంవత్సరాలలో 5 మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. కేసీఆర్ మీద కక్షతో ఆసుపత్రులపై పగ పెంచుకోవడం దారుణమన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఆసుపత్రులతో రాజకీయాలు చేయడం తగదని సూచించారు.
“బస్తీ దవాఖానలకు(Basthi Dawakhana) సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఒకటో తేదీనే జీతాలు” అన్న రేవంత్‌రెడ్డి, 6 నెలలుగా బస్తీ వైద్యులకు, సిబ్బందికి ఎందుకు వేతనాలు చెల్లించలేదు? రూ. 1400 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి, పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కంటి వెలుగు పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? బీఆర్ఎస్ పాలనలో పురోగమనం – కాంగ్రెస్ పాలనలో తిరోగమనం. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రుల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం” అని హరీష్ రావు(Harish Rao) పేర్కొన్నారు.

