కలం, సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) జిల్లా యర్కారం(Yerkaram) గ్రామంలో రాజకీయ కక్షలు మరోసారి రక్తపాతానికి దారితీశాయి. బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ మౌనిక భర్త, స్థానిక నేత చింతలపాటి మధు (మధుసూదన్)ను దుండగులు అత్యంత దారుణంగా హత్య చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం దుండగులు మధును గ్రామంలోనే మాటువేసి దాడి చేసి హత్య చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని గ్రామ శివారు ప్రాంతంలో పడేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.
గ్రామంలో కొంతకాలంగా కొనసాగుతున్న రాజకీయ ఆధిపత్య పోరు, పాత విభేదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. చింతలపాటి మధు భార్య మౌనిక గతంలో బీఆర్ఎస్ తరఫున సర్పంచ్‌గా పనిచేశారు. ఆ కుటుంబానికి గ్రామంలో గట్టి రాజకీయ పట్టు ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే వర్గపోరే ఈ ఘాతుకానికి దారితీసిందనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
మళ్లీ 2020 నాటి భయం
యర్కారం గ్రామంలో రాజకీయ హత్యలు కొత్తేమీ కాదు. 2020 ఫిబ్రవరిలో అప్పటి బీఆర్ఎస్ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న కూడా ఇదే తరహాలో హత్యకు గురయ్యారు. ఇప్పుడు అదే గ్రామానికి చెందిన మరో కీలక రాజకీయ నేత మధు హత్యకు గురికావడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలతో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటన నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అనుమానితుల కదలికలపై నిఘా కొనసాగుతోంది. మృతుడి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

