కలం, వెబ్ డెస్క్ : సింగరేణిపై వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ( Balka Suman) ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్ వద్ద ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాల్క సుమన్ అరెస్ట్ కు ముందు తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. తెలంగాణ భవన్ ఆవరణలో మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల తర్వాత అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తనను మళ్లీ అరెస్ట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
తనపై కేసులు పెట్టడం హాస్యాస్పదమని, సింగరేణి కుంభకోణాల మయంగా మారిందని మండిపడ్డారు. తొమ్మిది పది జిల్లాలకు విస్తరించిన సింగరేణిలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తనను జైలుకు పంపించే విషయంలో ఉన్న తాపత్రయం, హామీలపై చూపిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని వెల్లడించారు. వడ్లు కొనమని అన్నందుకు అశోక్ అనే ఆర్టీసీ డ్రైవర్ ను వేధిస్తున్నారని విమర్శించారు. తనకు జైలు కొత్త కాదని.. చట్టంపై తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. బాల్క సుమన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ని నాంపల్లి పీఎస్ కు తరలించారు. అయితే బాల్క సుమన్ ను పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అదంతా తప్పుడు ప్రచారామని తేలింది. కొద్ది సేపటి క్రితం తెలంగాణ భవన్ లో బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

