కలం, బీబీనగర్ : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా బీబీనగర్ (Bibinagar) కేంద్రంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను నిరసిస్తూ గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ధర్నాలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధాన్యం బస్తాలను రోడ్డుపై పోసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం ప్లకార్డులు చేతిలో పట్టుకుని ప్రధాన రహదారిపై బైఠాయించారు. రైతులకు మద్దతుగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేయడంతో బీబీనగర్ పరిసర ప్రాంతాలు మారు మ్రోగాయి. కొనుగోళ్లు సజావుగా సాగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మహా ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేక, సకాలంలో కాంటాలు కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైస్ మిల్లర్ల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. “రైతు ప్రభుత్వం అని చెప్పుకునే వారు, ఇప్పడు రైతులను రోడ్లపైకి తెచ్చారు. వెంటనే ఆలస్యం లేకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని వారు హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ధర్నా కారణంగా కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని సర్దుబాటు చేశారు.

