కలం, నిజామాబాద్ బ్యూరో : గులాబీ దళపతి కేసీఆర్ ఉద్యమ పిలుపును అందిపుచ్చుకొని తొలి జిల్లా పరిషత్ పీఠం సాధించిన గడ్డ అది.. కేసీఆర్ సిద్దాంతం నినాదాలు నమ్మి తెలంగాణ తెచ్చారని 2014 లో ఒక పార్లమెంట్ తో పాటు తొమ్మిదింటికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కృతజ్ఞత పూర్వకంగా గిఫ్ట్ గా ఇచ్చి కేసీఆర్ కు చేదోడు వాదోడుగా నిలిచిన జిల్లా. 2018 లో సైతం తొమ్మిదిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలిపించి ఆయన బాటలో నడిచిన ప్రాంతం. కేసీఆర్ (KCR) తన కూతురు కవిత ను ఎంపీగా టికెట్ ఇచ్చి నిలబెడితే కూడా ఆశీర్వదించారు. కానీ, ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో గులాబీ వాడిపోయింది. రెండు జాతీయ పార్టీలు గుచ్చిన ముళ్లతో బీఆర్ఎస్ విలవిలలాడుతోంది.
కాంగ్రెస్, టీడీపీ తర్వాత గులాబీ పార్టీకి నిజామాబాద్ (Nizamabad) జిల్లా కంచుకోట. రాజకీయంగా రెండు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీలకు పట్టం కడుతోంది ఇందూరు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో గులాబీ దళపతి అడుగులో అడుగు వేసింది నిజామాబాద్. తొలి అడ్వకేట్ JAC ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డిలోనే ఏర్పడింది. TRS పోటీ మొదలుపెట్టాక తొలి జడ్పీ పీఠం కట్టబెట్టింది నిజామాబాద్. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎల్లారెడ్డి స్థానం సాధించిన గులాబి పార్టీ 2014 లో తొమ్మిదింటికి.. తొమ్మిది స్థానాలు సాధించింది.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు తెలంగాణ రాష్ట్ర సమితి.. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది.. ఎంపీగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత (Kavitha) పోటీ చేస్తే కూడా ఆమెను కూడా గెలుపు పీఠం దక్కించారు.
అంతలా మద్దతుగా నిలిచారు ఇక్కడి జనాలు. 2018 లోనూ ఒక్క ఎల్లారెడ్డి తప్ప అంతటా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ మొత్తం ఎనిమిది మంది గెలుపొందారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ (BRS) కండువా కప్పుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటింది. ఇక కవిత ఎమ్మెల్సీ గా కూడా గెలిచి ఇక్కడి నుంచే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ప్రాతినిధ్యం వహించారు. ఇలా ఒక వెలుగు వెలిగింది గులాబీ పార్టీ.
నిజామాబాద్ లో నాడు కళకళ.. నేడు వెలవెల
నాడు కళకళ లాడిన గులాబీ పార్టీ నేడు వెలవెలబోతోంది. ఎంత మోదం లభించిందో అంతే స్థాయిలో ఖేదంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళీ 2009 రిజల్ట్స్ రిపీట్ అయ్యాయి. తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో కేవలం రెండే స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకునే పరిస్థితి వచ్చింది. బాల్కొండ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి గులాబీ పార్టీకి దూరంగా ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సలహాదారుగా కొనసాగుతున్నారు. అప్పటి నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి ఒక్కరే ఒంటరి పోరాటం చేస్తున్నారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీ గెలవడం చెప్పుకోదగ్గ విషయం.. జిల్లా అంతటా బీ ఆర్ పార్టీ శ్రేణులు సీనియర్ నాయకులు సైతం పెద్ద ఎత్తున కాంగ్రెస్ బీజేపీలలో చేరిపోయి బీఆర్ఎస్ కాస్తా చిక్కి శల్యమైన దుస్థితి నెలకొంది.
ప్రతికూల వాతావరణంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఎదురొడ్డి పోరాడుతున్నా ప్రయోజనం దక్కడం లేదు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా (Nizamabad) లో ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీ కూడా గులాబీ పార్టీ దక్కించుకోలేకపోయింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ నియోజక వర్గం భీంగల్ మున్సిపాలిటీలో కూడా కారు బేజారయింది. ఇక ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, బోధన్, ఆర్మూర్, భీం గల్ అన్నింటా కాంగ్రెస్ జయ కేతనం ఎగురవేసింది. నిజామాబాద్, కామారెడ్డిలో హంగ్ ఏర్పడినా మేయర్, చైర్మన్ పదవులు కూడా హస్తం అకౌంట్ లోకే వెళ్తున్నాయి. నిజామాబాద్ లో రెండు సార్లు మేయర్ స్థానం దక్కించుకున్న బీఆర్ఎస్ 2026 మున్సిపల్ ఎన్నికల్లో 60 డివిజన్ లలో కేవలం ఒక్కటే డివిజన్ గెలిచిందంటే ఎంతటి గడ్డుకాలం ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. బీజేపీ ఎంపీ అరవింద్ కూడా తనదైన శైలిలో ఎదుర్కొంటూ తన వ్యూహ ప్రతివ్యూహాలతో గులాబీ పార్టీని చిన్నాభిన్నం చేస్తున్నారు..
కవిత దూరంతో మరింత నష్టం!
కేసీఆర్ కూతురు కవితను బీఆర్ఎస్ సస్పెన్షన్ చేయడం.. పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేయడం కూడా నిజామాబాద్ జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. ఓ వైపు బలహీన పడ్డ పార్టీకి కవిత ఎపిసోడ్ మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మరింతగా డ్యామేజ్ చేసేసింది.. స్వయానా తండ్రి కేసీఆర్ పై పార్టీ నేతలపై కవిత చేస్తున్న తీవ్ర ఆరోపణలతో గులాబీ పార్టీ నిజామాబాద్ జిల్లాలోనూ కోలుకోలేని విధంగా డ్యామేజ్ అవుతోంది. కవితకు కూడా పెద్దగా మద్దతు లేకుండా పోయింది. అంతకుముందు నయానో భయానో కేసీఆర్ ఆదేశాలతోనో కవితకు ఎమ్మెల్యేలు కేడర్ మద్దతుగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయాక.. పరిస్థితులు మొత్తం మారిపోయాయి. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అయినట్లుగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Read Also: ఎరువుల యాప్ @ 13 లక్షలు.. నల్లగొండ టాప్
Follow Us On: Instagram


