కలం, వెబ్‌డెస్క్: బీజేపీ (BJP) ముఖ్య నాయకుల గ్రూప్ ఫోటోతో పార్టీ అధికారిక సోషల్ మీడియాలో చేసిన ఓ ఫోస్ట్ పెద్ద ఫోటో వార్‌కు దారి తీసింది. ఈ పోస్టులో కేటీఆర్ (KTR) , రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఉన్నట్లు ఎడిట్ చేసుకొని కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు పరస్పరం ట్రోలింగ్ స్టార్ట్ చేశాయి. పార్టీల అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనే ఈ వ్యవహారం అంతా జరగడం ఆసక్తికర చర్చకు తెర లేపింది.
ముందుగా బీజేపీ సోషల్ మీడియాలో డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, గూడెం నగేశ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. దీనికి వన్ టీమ్, వన్ మిషన్, వికసిత్ తెలంగాణ, వికసిత్ భారత్ అనే క్యాప్షన్‌ను జోడించారు. బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా నుంచి దీనికి ఘాటు రిప్లై వచ్చింది. బీజేపీలో ముఖ్యమైన వ్యక్తిని ఎలా మర్చిపోయారంటూ ఆ ఫోటోను ఎడిట్ చేసి అందులో సీఎం రేవంత్ రెడ్డి వారితో ఉన్నట్లు మార్చి పోస్ట్ చేశారు.
దీనిపై కాంగ్రెస్ సోషల్ మీడియా భగ్గుమంది. అదే ఫోటోలో ఏకంగా కేటీఆర్ బండి సంజయ్ కాళ్ల మీద పడ్డట్లు ఎడిట్ చేసి పార్టీ అధికారిక ఖాతాల్లో పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చారు. దీంతో మూడు పార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు ఒకరిపై ఒకరు కామెంట్లతో విరుచుకుపడ్డారు. కొందరు నెటిజన్లు మాత్రం మూడు పార్టీలు ప్రజా సమస్యలను వదిలేసి ఇలాంటి చౌకబారు విమర్శలు చేసుకుంటున్నాయని కామెంట్ చేస్తున్నారు.

