సంక్షోభంలో డెయిరీ.. సంచలనంలో ఎన్నికలు!

కలం, నల్లగొండ బ్యూరో: పాడి రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన మదర్ డెయిరీ (నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పరస్పర సహాయ సహకార సమాఖ్య)(Mother Dairy) డైరెక్టర్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. నల్లగొండ, వంగపల్లి, వలిగొండ పరిధిలోని మూడు డైరెక్టర్ స్థానాలకు సోమవారం పోలింగ్ ముగిసింది. గెలుపు కోసం అభ్యర్థులు కోట్లలో వెదజల్లడం ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో చర్చనీయాంశమైంది.

తక్కువ సంఖ్యలో ఓటర్లు ఉండటంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. భారీగా తాయిలాలు ఇచ్చేదాకా వెళ్లింది. డెయిరీలోని డైరెక్టర్ పోస్టులకు (ఒకటి మహిళలకు రిజర్వ్, రెండు జనరల్) మొత్తంగా 8 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. కాంగ్రెస్ మద్దతుదారులుగా పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాయితి వెంకట రామిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, బెల్లి లింగస్వామి, అండెం మంజుల, చీర లావణ్య బరిలోకి దిగారు. బీఆర్ఎస్ తరఫున దొంతిరి సోమిరెడ్డి, కందాల అలివేలు పోటీ చేశారు. కొన్నాళ్లుగా పాల సేకరణ తగ్గి కేంద్రాలు మూతపడటంతో ఓటర్ల సంఖ్య 308 నుంచి 250కి పడిపోయింది.

నిబంధనల ప్రకారం ప్రతీ సొసైటీ చైర్మన్ ముగ్గురు అభ్యర్థులకు ఓటు వేయాల్సి ఉంటుంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు పంపిణీ చేయడం గమనార్హం. బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థి ఓటరుకు రూ. 10 వేలతో పాటు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి లడ్డూ ప్రసాదం అందించారు. ఆపై.. తనకే ఓటు వేయాలని దేవుడిపై ప్రమాణం చేయించుకున్నారనే సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఓటర్లు చేజారకుండా పోలింగ్‌కు ఒకరోజు ముందే రహస్య ప్రాంతాలకు తరలించారు.

సోమవారం ఉదయం నేరుగా హయత్ నగర్‌లో పోలింగ్ కేంద్రానికి తరలించారు. అయితే.. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మధ్య విభేదాలు బయటపడ్డాయి. తన నియోజకవర్గ పరిధిలోని వలిగొండ స్థానానికి ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థిని ఎలా ఖరారు చేస్తారని అనిల్ సీరియస్ అవ్వడంతో, అయిలయ్య దిద్దుబాటు చర్యలకు దిగారు. ఆయన ప్రతిపాదించిన కాయితి వెంకటరెడ్డిని తప్పుకోవాలని సూచించినా, ఉపసంహరణ గడువు ముగియడంతో డమ్మీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

జీతభత్యాలు లేకున్నా.. కోట్లలో ఖర్చు?

డైరెక్టర్ పదవికి ఎలాంటి జీతభత్యాలు ఉండవు. కేవలం సిట్టింగ్ ఫీజు, అలవెన్సులు మాత్రమే లభిస్తాయి. అయినా సరే, ఓటుకు పదివేలు ఇస్తూ అభ్యర్థులు లక్షలు ఖర్చు చేయడం వెనుక పలు సందేహాలు వ్యక్తం అయ్యాయి. పాల సేకరణ వాహనాల రవాణా, ప్యాకింగ్ మెటీరియల్ కొనుగోళ్లు, ప్లాంట్ల మెయింటెనెన్స్ కాంట్రాక్టులను తమ బినామీలకు కట్టబెట్టుకునేందుకే భారీగా ఖర్చు చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. పాడి రైతులకు ఇచ్చే దాణా(ఫీడ్), యంత్రాల కొనుగోళ్లలో రూ. కోట్లలో టెండర్లు సాగుతాయి. వీటిలో భారీగా నిధుల మళ్లింపునకు ఆస్కారం ఉందనే ఆరోపణలు లేకపోలేదు. గ్రామీణ సొసైటీ చైర్మన్లపై పట్టు సాధించి, భవిష్యత్తులో ఎమ్మెల్యే, జడ్పీటీసీ టికెట్లు క్లెయిమ్ చేసేందుకు పదవిని తొలి మెట్టుగా వాడుకుంటున్నారనే టాక్ ఉంది.

ప్రశ్నార్థకంగా సంస్థ ఉనికి

రూ. కోట్లలో అప్పులు, రోజురోజుకూ పడిపోయే మార్కెట్ షేర్‌తో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన మదర్ డెయిరీని కాపాడుకోవాలంటే తక్షణ ప్రక్షాళన అత్యవసరమని పాడి రైతులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాల ఉత్పత్తుల విక్రయాలు, పంపిణీ వ్యవస్థ వికేంద్రీకరణ పారదర్శకంగా జరగడంతో పాటు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన పాలక బోర్డును ప్రక్షాళన చేసి, డెయిరీ నిర్వహణను సంపూర్ణంగా వృత్తిపరమైన మేనేజ్‌మెంట్‌కు అప్పగించాల్సిన అవసరం ఉంది.

నామినేషన్ల ఘట్టం నుంచి పోలింగ్ వరకు గెలుపు కోసం కోట్లాది రూపాయలు చల్లుతున్న నేతలు, రేపు పదవిలోకి వచ్చాక ఆ సొమ్మును డెయిరీ నిధుల నుంచే వివిధ రూపాల్లో రాబట్టుకునే ప్రమాదం ఉందని పాడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ‘కాస్ట్లీ’ ఎన్నికల రాజకీయాల నడుమ మదర్ డెయిరీ మళ్లీ కోలుకుని పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందా లేక ప్రైవేటు రంగానికి బలిపీఠం అవుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి.

దివాళా దిశగా డెయిరీ..
అభ్యర్థులు గెలుపు కోసం కోట్లు కుమ్మరిస్తున్నా..మరోవైపు మదర్ డెయిరీ మాత్రం రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. మద్దతు ధర లేక, చెల్లింపులు ఆలస్యమవ్వడంతో రైతులు ప్రైవేటు డెయిరీల వైపు మళ్లుతున్నారు. ఫలితంగా వందలాది పాల సేకరణ కేంద్రాలు మూతపడ్డాయి. యిరీని పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాల్సిన నేతలు, కేవలం స్వలాభం, అక్రమ సంపాదన కోసమే ఎన్నికల వేళ లక్షలు చల్లుతున్నారని పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ కాస్ట్లీ రాజకీయాల మధ్య మదర్ డెయిరీ మళ్లీ లాభాల బాట పడుతుందా లేక ప్రైవేటు రంగానికి బలిపీఠం అవుతుందా అన్నది వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>