కలం, హనుమకొండ: హనుమకొండ పూర్వ ప్రజా సంబంధాల అధికారి (DPRO) అయూబ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. విచారణ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి (DRO) శ్రీనివాస్‌ను నియమించారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల (Journalist Accreditation) జారీలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మంగళవారం కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
పది మంది సభ్యులతో కూడిన అక్రిడిటేషన్ కమిటీ రెండు దఫాలుగా సమావేశమై జర్నలిస్టుల దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి అక్రిడిటేషన్ మంజూరుకు, అర్హత లేనివారి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచేందుకు తీర్మానించినట్లు సభ్యులు తెలిపారు.
అయితే కమిటీ సిఫారసులను పక్కనపెట్టి, కలెక్టర్‌ను తప్పుదోవ పట్టించి ఇష్టానుసారంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసినట్లు వారు ఆరోపించారు. రాజకీయ నాయకుల వద్ద పనిచేసే వ్యక్తులకు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు సైతం కార్డులు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే DPRO అయూబ్ సమక్షంలో జరిగిన రెండు అక్రిడిటేషన్ (Journalist Accreditation) కమిటీ సమావేశాలకు సంబంధించిన జాబితాలను సభ్యులకు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో విషయం చర్చనీయాంశంగా మారింది.
ఫిర్యాదు చేసిన కమిటీ సభ్యుల్లో గాడిపల్లి మధు, బీఆర్ లెనిన్, గడ్డం కేశవమూర్తి, మస్కపురి సుధాకర్, కంకణాల సంతోష్, బొల్ల అమర్, గోకారపు శ్యాం, వల్లాల జగన్, ఎన్. బుచ్చిరెడ్డి, నయీమ్ ఉన్నారు.
Also Read: దేవుళ్లపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్.. రామచందర్ రావు ఫైర్!
Follow Us On: X(Twitter)

