కలం, ఖమ్మం బ్యూరో: మణుగూరులో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 200 మీటర్ల భారీ జాతీయ జెండాను యువత ప్రదర్శించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని (Independence Day) పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో శుక్రవారం భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో 200 మీటర్ల భారీ జాతీయ పతాక ప్రదర్శన వైభవంగా జరిగింది. భారతీయ సేవా సమితి సభ్యుడు దుగ్గి బ్రహ్మతేజ నేతృత్వంలో నిర్వహించిన ఈ ప్రదర్శన స్థానిక ప్రజలలో, యువతలో అపూర్వమైన దేశభక్తి చైతన్యాన్ని నింపింది.
పట్టణంలోని అశోక్ నగర్ నుండి ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ అంబేద్కర్ సెంటర్ మీదుగా సురక్ష బస్టాండ్ వరకు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. 200 మీటర్ల సుదీర్ఘమైన త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని విద్యార్థులు, ఉపాధ్యాయులు, నవ యువత, పుర ప్రముఖులు పలు ప్రజాసంఘాల నాయకులు అడుగులు వేశారు. ర్యాలీ పొడవునా దేశభక్తి నినాదాలతో మణుగూరు పురవీధులు మారుమోగాయి.
ఈ సందర్భంగా భారతీయ సేవా సమితి సభ్యుడు దుగ్గి బ్రహ్మతేజ మాట్లాడుతూ నేటి యువత చెడు అలవాట్లకు, వ్యసనాలకు బానిస కాకుండా దేశంపై భక్తిని, కుటుంబంపై అభిమానాన్ని పెంపొందించుకోవాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. యువత చైతన్యవంతమై దేశ రక్షణలో, ప్రగతిలో ముందుండాలని పిలుపునిచ్చారు.

