రోహిత్ భవిష్యత్తుపై హేడెన్ కీలక వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్ : 2027 వన్డే వరల్డ్ కప్‌లో భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆడతాడా? అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అయితే రోహిత్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ (Matthew Hayden) కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఎప్పుడు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలో నిర్ణయించేది అతడేనని హేడెన్ స్పష్టం చేశాడు. 39 ఏళ్ల రోహిత్ ప్రస్తుతం భారత్ తరఫున వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ వన్డేలతో పాటు ఐపీఎల్‌ను కూడా కొనసాగించాలంటే ఎంతో శక్తి, ఆసక్తి అవసరమని హేడెన్ అభిప్రాయపడ్డాడు. రోహిత్‌లో ఇంకా ఆ ఉత్సాహం, సామర్థ్యం ఉంటే అతని నిర్ణయానికే ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ సిరీస్‌తో పెరిగిన ఆసక్తి

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ ప్రదర్శన అతని భవిష్యత్తుపై చర్చకు మరింత ఊతమిచ్చింది. లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డే అతని చివరి మ్యాచ్ కావచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో రోహిత్ అద్భుతంగా ఆడాడు. 388 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ 110 బంతుల్లో 138 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ సిరీస్‌లో మొత్తం 175 పరుగులు చేసిన రోహిత్ 58.33 సగటుతో, 98.31 స్ట్రైక్‌రేట్‌తో రాణించాడు.

కోహ్లీతో కీలక భాగస్వామ్యం

నిర్ణయాత్మక వన్డేలో రోహిత్‌కు విరాట్ కోహ్లీ అద్భుతంగా సహకరించాడు. కోహ్లీ 60 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇద్దరూ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పినా, చివరకు భారత్ 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కోల్పోయింది. వన్డేల్లో రోహిత్ ఇప్పటివరకు 288 మ్యాచ్‌లు ఆడి 11,895 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 62 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 264 పరుగులు.

2026లోనూ మంచి ఫామ్

2026లో కూడా రోహిత్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ ఏడాది 9 వన్డేలలో 379 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ ఉన్నాయి. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడా? అనే ఆసక్తి అభిమానులలో మరింత పెరిగింది. 2027 వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి రోహిత్ వయసు 40 ఏళ్లకు చేరువలో ఉంటుంది. అయినప్పటికీ అతని ప్రస్తుత ఫామ్, అనుభవం భారత జట్టుకు కీలకంగా మారే అవకాశం ఉంది. రోహిత్ కొనసాగాలా? ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలి? అనే విషయంలో తుది నిర్ణయం మాత్రం రోహిత్ శర్మదేనని మాథ్యూ హేడెన్ స్పష్టం చేశాడు. రోహిత్‌లో ఇంకా క్రికెట్ ఆడాలనే ఉత్సాహం, సామర్థ్యం ఉంటే అతని నిర్ణయాన్ని గౌరవించాల్సిందే అన్నది హేడెన్ అభిప్రాయం. దీంతో 2027 వరల్డ్ కప్ వరకు రోహిత్ కొనసాగుతాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>