కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ పార్టీ DNAలోనే ఎస్సీల వ్యతిరేకత ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చేరిగారు. బీఆర్ఎస్ జాతి కక్ష, రాజకీయ వివక్ష ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎంగా ఎస్సీని చేస్తానని కేసీఆర్ మాట తప్పారని గుర్తు చేశారు. వివేక్, చంద్రశేఖర్ లాంటి వారు సీఎం అవుతారని అనుఅనుకున్నామని.. కానీ ఎస్సీలకు పరిపాలన చేతకాదు, దొర సీఎం కావాలని కేసీఆర్ మాట మార్చారని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ కేబినెట్ కూర్పు చూస్తే ఎస్సీలపై వ్యతిరేకత కనిపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2018 తర్వాత ఎస్సీలలో కొప్పుల ఈశ్వర్ కు మాత్రమే మంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. ఎస్సీలపై కక్ష సాధింపు తప్ప కనీస మానవత్వం చూపలేదని వ్యాఖ్యానించారు. భట్టిని ప్రతిపక్ష నేతను చేస్తే ఫిరాయింపులతో ఆ పదవి లేకుండా చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ గా ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రిని చేశామని వెల్లడించారు. భట్టి, అడ్లూరి, వివేక్, దామోదర, సీతక్కలకు మేం మంత్రి పదవులు ఇచ్చామని స్పష్టం చేశారు.
కేసీఆర్ కు కనువిప్పు కలగాలని ఎస్సీని స్పీకర్ ను చేశామన్న సీఎం రేవంత్ .. ఎస్సీ ముందు కింద కూర్చుని మైక్ అడగాలా? అని కేసీఆర్ సభకు రావడం లేదని విమర్శించారు. స్పీకర్, ఆర్థిక మంత్రిగా ఎస్సీ ఉండద్దని బీఆర్ఎస్ విధానం అని చెప్పారు. భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో లోపాలు ఉంటే ఎత్తి చూపాలని సూచించారు. కానీ భట్టిని వ్యతిగతంగా అవమానించేలా హరీశ్, కేటీఆర్ ప్రవర్తించారని పేర్కొన్నారు. ఎస్సీ స్పీకర్ స్థానంలో ఉండద్దని పోడియం దగ్గర నిరసన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వాళ్ల కులం గొప్పదట.. మనం చెప్పులు కుట్టుకునే ఉండాలట, అందుకే బీఆర్ఎస్ వాళ్లు ఈ విధంగా ప్రవరిస్తున్నారని ఆరోపించారు.

