కలం డెస్క్ : Defection Politics | ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, అందువల్ల వారిపై అనర్హత వేటు వేయలేమని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తేల్చి చెప్పడం రాజకీయ పార్టీల్లో సరికొత్త చర్చకు దారితీసింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలమీద గురువారం నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. స్పీకర్ పక్షపాతంగా నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. పార్టీ మారినట్లుగా ఆధారాలు, ఘటనలు కళ్ళముందు కనిపిస్తున్నా చర్యలు తీసుకోలేదని స్పీకర్ తీరును విమర్శించారు. ఫిరాయింపులకు ఆజ్యం పోసిన బీఆర్ఎస్ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నదంటూ కాంగ్రెస్ నేతలు రివర్స్ ఫైర్ అయ్యారు. నీవు నేర్పిన విద్యే.. అంటూ గతాన్ని గుర్తుచేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తున్న సమయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.
ఫిరాయింపులు రొటీన్ ప్రాక్టీస్ :
బెల్లం ఎక్కడుంటే చీమలు అక్కడకు చేరుతాయన్న చందంగా అధికారంలో ఉన్న పార్టీలోకి ఫిరాయించడం(Defection Politics) ఒక ఆనవాయితీగానే మారిందే. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లలో ఇది రొటీన్ ప్రాక్టీసుగానే కొనసాగింది. కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, బహుజన్ సమాజ్ పార్టీల నుంచి ఎన్నికైన చాలా మంది ఎమ్మెల్యేలు అధికార బీఆర్ఎస్‌లో చేరారు. కొందరు మంత్రులు కూడా అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదంటూ అప్పట్లో ఆ పార్టీలు బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగాయి. కోర్టుల్లో పిటిషన్లు కూడా వేశాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఫిరాయింపులను నిరోధించడానికి ఒక చట్టాన్ని చేసుకున్నా అందులోని లొసుగులను వాడుకుని యధేచ్ఛగా అనర్హత నుంచి తప్పించుకుంటున్నారు.
బీఆర్ఎస్ హయాంలో యధేచ్ఛగా.. :
గడచిన పదేండ్లలో వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ తనవైపు లాక్కున్నది. తెలుగుదేశం నుంచి చేరిన తలసాని శ్రీనివాస యాదవ్‌కు, కాంగ్రెస్ నుంచి చేరిన సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులూ దక్కాయి. ఫస్ట్ టర్ములో 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలలో పన్నెండు మంది బీఆర్ఎస్‌లో చేరిపోయారు. సెకండ్ టర్ములో ‘శాసనసభా పక్షం విలీనం..’ పేరుతో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 12 మందిని చేర్చుకున్న బీఆర్ఎస్ తన చర్యను సమర్ధించుకున్నది. ఇప్పుడు 38 మందితో ప్రతిపక్షంగా ఉంటే అందులో పదిమంది చేజారిపోవడంతో ఆ బాధను అనుభవిస్తున్నది. ఒకవైపు రాజ్యాంగ పరిరక్షణ పేరుతో రాహుల్‌గాంధీ చేతిలో పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతున్నారని, ఇంకోవైపు తెలంగాణలో దానికి విరుద్ధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే తీరులో కాంగ్రెస్ వ్యవహరిస్తున్నదని గులాబీ నేతలు గుర్తుచేస్తున్నారు.
రెండు పార్టీలు దొందూ.. దొందే.. :
అధికారాన్ని కాపాడుకోడానికి పార్టీలు పడరాని పాట్లు పడతాయి. అధికార పార్టీలో ఉంటే అవసరాలు తీర్చుకోవచ్చని ఎమ్మెల్యేలు భావిస్తూ ఉంటారు. నాడు బీఆర్ఎస్ అయినా.. నేడు కాంగ్రెస్ అయినా.. దొందూ.. దొందే.. అనే విమర్శలూ వస్తున్నాయి. తొలి టర్ములో బొటాబొటి సీట్లతో అధికారాన్ని చేపట్టిన బీఆర్ఎస్ తన స్థానాన్ని పదిలం చేసుకోడానికి ఇతర పార్టీల నేతలకు గాలం వేసిందని బహిరంగంగానే చర్చలున్నాయి. రెండోసారి 88 మంది గెలిచినా ప్రతిపక్షం లేకుండా చేయాలన్న దుష్ట తలంపుతో కాంగ్రెస్ నుంచి లాక్కున్నదనే విమర్శలూ ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కొద్దన్న దుగ్ధతోనే బీఆర్ఎస్ ప్రజాస్వామ్య విలువలకు పాతరేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో నాడు బీఆర్ఎస్ చేసిన పనినే కొనసాగిస్తున్నదని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Also: నెలాఖరుకు అసెంబ్లీ సమావేశాలు ?
Follow Us On: Sharechat


