కలం, వెబ్ డెస్క్: గోర్లు మన ఆరోగ్యం గురించి చాలా చెప్తాయి. మనకు కూడా తెలియని ఆరోగ్య సమస్యలకు సంబంధించి లక్షణాలు కూడా గోర్లలో (Black Line on Nails) కనిపిస్తాయి. ఇప్పుడు ఈ గోర్ల విషయం ఎందుకనుకుంటున్నారా? తాజాగా సోషల్ మీడియాలో గోర్లు పెద్ద చర్చకు దారితీశాయి. ఓ మహిళ తన గోళ్లకు సంబంధించిన ఫొలోను షేర్ చేయడంతో దానిపై జరిగిన చర్చ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందని ఆలోచిస్తున్నారా? ఆ మహిళ షేర్ చేసిన ఫొటోలో.. గోళ్లపై ఒక నల్లని గీత కనిపిస్తోంది. అది చూసిన నెటిజన్స్ అలెర్ట్ అయ్యారు. వెంటనే ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకోవాలని సూచించారు. అది స్కిన్ క్యాన్సర్‌కి సూచన కావచ్చని, ఆలస్యం చేయొద్దని హెచ్చరించారు. ఇలా ఒకటి రెండు కాదు వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. నిజంగానే గోళ్లపై నల్లగీత ఉంటే.. అప్రమత్తం అవ్వాల్సిందేనా? అసలు ఆ నల్లటి గీత ఏం సూచిస్తుంది? దీనికి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసా?
అసలు ఈ గీతలెందుకు వస్తాయ్?
గోర్లపై నల్లగీతలు (Black Line on Nails) లేదా గోధుమ రంగు గీతలు రావడాన్ని వైద్య పరిభాషలో మెలనోనీకియా అంటారు. ఇవి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. గాయం, పోషక లోపాలు, హార్మోన్ల మార్పు, కొన్ని ఔషధాల ప్రభావం.. ఇలా చాలానే కారణాలు కావొచ్చు. ముదురు రంగు చర్మం ఉన్నవారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
అలా జరిగితే డేంజరే!
గోర్లపై నల్ల గీతలు కనిపించడం ప్రతిసారీ ప్రమాదకరమని కాదు. కానీ దానిని గమనించుకోవడం చాలా ముఖ్యం. ఒక్కోసారి అది నిజంగానే చర్మ క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చు. గోర్లపై నల్లగీత అకస్మాత్తుగా వచ్చి.. కాలక్రమేణా అది వెడల్పు అవుతుంటే అప్రమత్తం కావాల్సిందే. అది సబ్‌అంగువల్ మెలనోమా అనే అరుదైన చర్మ క్యాన్సర్‌కు సంకేతం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్యాన్సర్ చాలా వేగంగా వ్యాపించే స్వభావాన్ని కలిగి ఉంటుందని వివరిస్తున్నారు.
అదొక్కటే లక్షణం కాదు..
చర్మ క్యాన్సర్‌కు గోర్లల్లో నల్లగీతనే సంకేతంగా చూపవని, మరిన్ని లక్షణాలను కూడా చూపుతాయని వైద్య వర్గాలు అంటున్నాయి. నల్లగీత రావడంతో పాటు గోళ్లు పగలడం, చీలడం, ఆకారం మారడం, రంగు తేడాగా కనిపించడం, వాపు, నొప్పి, గోళ్లు చిగురు నుంచి ఊడిపోవడం, పుండ్లుగా మారడం, రక్తస్రావం కావడం ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. నలుపుగీతతో పాటు కొన్ని లక్షణాలను అయినా గోళ్లు ప్రదర్శిస్తాయని వైద్యులు చెప్తున్నారు. గోర్లపై నల్ల గీత వస్తే వైద్యుడిని సంప్రదిస్తే వాళ్లు ఈ లక్షణాలన్నింటినీ పరిశీలిస్తారు. అయితే గోళ్లపై కనిపించే చిన్న మార్పులను తేలికగా తీసుకోవద్దు. మెలనోమా లాంటి క్యాన్సర్లు తొందరగా గుర్తిస్తే చికిత్స ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయని వైద్యులు అంటున్నారు.
Read Also: సాక్స్ ధరించి నిద్రపోవడం మంచిదేనా.. స్టడీ ఏం చెబుతోంది?
Follow Us On: Pinterest


