కలం, నిర్మల్ : తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ఆ పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి (Chandrashekhar Tiwari) ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంపై నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలని సూచించారు.
ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోందని, పశ్చిమ బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించుకుందని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తికాకముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రజలు బీజేపీకి అధికార బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకు అనుగుణంగా ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లా కార్యాలయానికి వచ్చిన చంద్రశేఖర్ తివారికి పార్టీ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు దత్తాత్రి, మల్లిక, రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇంచార్జి గోపిడి స్రవంతి, నాయకులు అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

