కలం, తెలంగాణ బ్యూరో : వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఒకటే.. చందంగా ఆంధ్రప్రదేశ్ అవసరాలను తీర్చడంలో ఎక్కడలేని ఆసక్తి కనబరిచే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో మాత్రం నాన్చివేత ధోరణి అవలంబించడం పొలిటికల్ (BJP vs Congress) కోల్డ్ వార్‌కు దారితీసింది. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసిన నాలుగైదు రోజుల్లోనే పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు పెట్టి ఆమోదం పొంది చట్టంగా మారేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఐదు గ్రామ పంచాయతీల విషయంలో తాత్సారం చేయడం రాజకీయ వివాదానికి దారితీసింది. పన్నెండేండ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన భద్రాచలం మండలానికి చెందిన ఏటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తమపట్నం, పిచ్చుకలపాడు, గుండాల గ్రామ పంచాయతీలను, వీటిలోని 19 రెవెన్యూ గ్రామాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలన్న విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఏపీలో విలీనం :
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 2014లో ఏర్పడిన తర్వాత వారాల వ్యవధిలోనే ఐదు గ్రామ పంచాయతీలను, అందులోని 19 రెవెన్యూ గ్రామాలను ఏపీలో విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు చేసింది. తెలంగాణ రాష్ట్రం లాంఛనంగా ఏర్పడకముందే ఏడు మండలాలు, అందులోని గ్రామాలు ఏపీలో కలిసిపోయాయి. ఆ తర్వాత సవరణ చట్టంగా ఐదు గ్రామ పంచాయతీలను, 19 గ్రామాలను విలీనం చేసింది. తెలంగాణ అభిప్రాయానికి భిన్నంగా, ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన భూములున్న పురుషోత్తమ పట్నం కూడా ఏపీలో విలీనం కావడం అనాలోచిత నిర్ణయమంటూ అప్పట్లోనే తెలంగాణ ప్రభుత్వం తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆలయం ఒక చోట, దానికి చెందిన భూములు మరో రాష్ట్రంలో ఉండడం పరిపాలనాపరమైన ఇబ్బందులకు కారణమైందని వ్యాఖ్యానించింది.
ఆదివాసీ ప్రజల ప్రాక్టికల్ ఇబ్బందులు :
పోలవరం (Polavaram) ముంపుతో ఈ ఐదు గ్రామ పంచాయతీలకు ఎలాంటి సంబంధం లేదని, అయినా వీటిని ఏపీలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. పలు సందర్భాల్లో ఈ గ్రామాల్లోని ఆదివాసీ ప్రజలు వివిధ రూపాల్లో నిరసనలు చేశారు. ఈ గ్రామాలన్నీ భద్రాచలం (Bhadrachalam) ఆలయంతో, పట్టణంతో రకరకాల సంబంధాల్లో ఉంటున్నవేనని, హఠాత్తుగా ఏపీలో విలీనం చేయడం ఆచరణాత్మక సమస్యలకు కారణమవుతున్నది. ఆదివాసీ ప్రజలు వారి వ్యవసాయ ఉత్పత్తులను, అటవీ ఉత్పత్తులను పక్క గ్రామాలకు తీసుకెళ్ళాలంటే ఏపీ సరిహద్దులోకి వెళ్లి తిరిగి తెలంగాణలోకి ఎంట్రీ కావాల్సి వస్తున్నది. సరిహద్దు చెక్ పోస్టుల్లో తనిఖీలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు వస్తున్నాయని, సమయం వృథా అవుతున్నదనేది స్థానిక ఆదివాసీల వాదన. ఇంతకాలం మావోయిస్టు సమస్య ఉండడంతో శాంతిభద్రతల కోణం నుంచి పోలీసుల తనిఖీలు అనివార్యమయ్యాయి.
ప్రభుత్వపరంగానూ అభివృద్ధికి ఆటంకాలు :
తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం ఆలయాన్ని రూ. 300 కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఆ అభివృద్ధి పనుల్లో కేవలం ఆలయానికి సంబంధించినవే కాకుండా మౌలిక సౌకర్యాల కల్పన, ఆలయానికి చెందిన భూములకు సంబంధించిన అంశాలూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పరిపాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకున్నా ఆలయానికి చెందిన సుమారు 889 ఎకరాల భూమి ఆంద్రప్రదేశ్‌లో విలీనమైన పురుషోత్తమపట్నం గ్రామ పంచాయతీలో ఉండడం రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. ఆలయం తెలంగాణలో, దానికి చెందిన భూములు ఆంధ్రప్రదేశ్‌లో ఉండడంతో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నది. దీనికి తోడు ఈ ఐదు పంచాయతీల్లోని 19 గ్రామాల మీదుగా స్థానిక ఆదివాసీలు ఎటు వెళ్ళాలన్నా గోదావరి నది హద్దు కారణంగా ఏపీ భూభాగంలోకి వెళ్లి తిరిగి తెలంగాణలోకి ప్రవేశించాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
జిల్లా కేంద్రంతో తలెత్తుతున్న అదనపు ఇబ్బందులు :
ఈ ఐదు గ్రామ పంచాయతీలకు భద్రాచలం పట్టణంతో భౌగోళికంగా, సాంస్కృతికంగా, ఆచారపరంగా శతాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కానీ ఏపీలో విలీనం చేయడంతో మనసు ఒక రాష్ట్రంలో మనిషి మరో రాష్ట్రంలో అనే చందంగా తయారైందన్నది స్థానిక భావన. దీనికి తోడు ఏ చిన్న అవసరమొచ్చినా సుమారు 280 కి.మీ. దూరంలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరుకు వెళ్ళాల్సి వస్తున్నదని, దాదాపు 8 గంటల పాటు రోడ్డు మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తున్నదని వాపోతున్నారు. కానీ భద్రాచలం మాత్రం 40 కి.మీ. దూరమేనని, గంటసేపట్లోనే వెళ్ళగలమని, తిరిగి ఈ గ్రామాలను, పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశాన్ని కొత్తగూడెం జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు తెలంగాణ అసెంబ్లీ వేదికగానే పలుమార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు.
కేంద్రానికి తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి :
ఐదు గ్రామ పంచాయతీలు, అందులోని 19 గ్రామాల ప్రజల ప్రాక్టికల్ ఇబ్బందులు, పరిపాలనాపరమైన సమస్యలను పరిగణనలోకి తీసుకుని తిరిగి వీటిని తెలంగాణలోనే విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆ జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ సహా కేంద్ర హోం మంత్రికి రాతపూర్వకంగానే పలుమార్లు రిక్వెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ఆగమేఘాల మీద స్పందించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రిక్వెస్టు విషయంలో నాన్చివేత ధోరణి అవలంబించడం వివక్షకు నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలపై కాంగ్రెస్ ఒత్తిడి చేయడానికి సిద్ధమవుతున్నది. కేంద్ర హోం సహాయ మంత్రిగా బండి సంజయ్ చొరవ తీసుకుని వారు నిత్యం వల్లించే జై శ్రీరామ్ (శ్రీరామచంద్రుడి) స్లోగన్‌కు అనుగుణంగా ఆలయానికి చెందిన భూములు కూడా తెలంగాణలోనే ఉండేలా చట్ట సవరణ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ (BJP vs Congress) పొలిటికల్ వార్‌గా మారే అవకాశమున్నది.
Read Also: సోషల్ మీడియా అడ్డాగా డెత్ ట్రాప్స్!
Follow Us On : WhatsApp

