కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్‌ను (Komuravelli Railway Station) ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ. ఇకపై సామాన్య భక్తులు కేవలం 25 రూపాయల చౌక ఛార్జీతోనే సికింద్రాబాద్ నుంచి కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి చేరుకోవచ్చని తెలిపారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్ వద్ద డబుల్ లైన్ ట్రాక్‌తో పాటు రెండు ప్లాట్ ఫామ్ లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు.
రైల్వే స్టేషన్ నుంచి కొమురవెల్లి మల్లన్న ఆలయానికి భక్తుల సౌకర్యార్థం షెడ్యూల్డ్ బస్సు సర్వీసులు నడపాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రైలు విస్తరణ కోసం భూసేకరణ చేపట్టాలని కోరుతూ ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రికి లేఖలు రాశానని, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 48 వేల కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయని వెల్లడించారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత 12 ఏళ్లలో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి తెలంగాణలోని 43 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో అత్యంత ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
తెలంగాణకు ఇప్పటికే 5 వందే భారత్ రైళ్లతో పాటు భవిష్యత్తు కోసం 3 బుల్లెట్ రైలు మార్గాలను కేటాయించినట్లు తెలిపారు. దశాబ్దాల నాటి తెలంగాణ ప్రజల కల అయిన వరంగల్ రైల్వే కోచ్, రైల్వే ఇంజన్ల తయారీ ఫ్యాక్టరీని కేంద్రం మంజూరు చేసిందని, దీనిని వచ్చే ఏడాదిలోనే ప్రారంభించబోతున్నామని ప్రకటించారు.
ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయం చేయాలన్నారు. పాలనలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు స్పష్టం చేశారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు రఘు నందన్ రావు, కిరణ్ కుమార్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

