కలం, కరీంనగర్ బ్యూరో: ‘అర్బన్ ఛాలెంజ్ ఫండ్’ (UCF) కింద తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం నిధుల వరద పారించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 3 ప్రధాన ప్రాజెక్టుల కోసం రూ.5,681 కోట్లను మంజూరు చేయగా.. అందులో కరీంనగర్ నగరాభివృద్ధి కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో ఏకంగా రూ.840 కోట్ల భారీ ప్యాకేజీని ఆమోదించడం పట్ల నగరంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో కరీంనగర్ బీజేపీ (BJP Karimnagar) నాయకులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు.
కరీంనగర్ అభివృద్ధికి ఇంతటి భారీ ప్యాకేజీని మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ కుమార్‌ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు, నగర ప్రజలు పాల్గొన్నారు.
Read Also: రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
Follow Us On: Sharechat

