కలం, వెబ్ డెస్క్ : రిజర్వేషన్, క్రీమీ లేయర్ పై సుప్రీం కోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యవస్థలో సామాజిక చలనశీలత (సోషల్ మొబిలిటీ)ను దృష్టిలో ఉంచుకొని, విద్యా, ఆర్థికంగా పురోగతి సాధించిన కుటుంబాలు కోటా ప్రయోజనాలు కోరడం సమంజసమా అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వెనుకబడిన తరగతుల్లోని ‘క్రీమీ లేయర్’ (ఉన్నత వర్గం)కు రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగించడం విషయంపై విచారణ జరుగుతున్న కేసులో జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
“తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులైతే, పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు?” అని ధర్మాసనం ప్రశ్నించింది. తల్లిదండ్రులు మంచి ఉద్యోగాల్లో ఉండి, మంచి ఆదాయం పొందుతున్నప్పుడు కూడా వారి పిల్లలు రిజర్వేషన్ కోరడం సరైనదా?.. వారు రిజర్వేషన్ నుంచి బయటపడాలి అని సుప్రీం కోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్ అధికారులుగా ఉన్న కుటుంబాల పిల్లలు ఇంకా రిజర్వేషన్ ప్రయోజనాలు కోరడం వెనుక హేతుబద్ధత ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది.
రిజర్వేషన్ ద్వారా సామాజిక, ఆర్థిక పురోగతి సాధించిన తర్వాత తదుపరి తరానికి కూడా అదే ప్రయోజనాలు కొనసాగించడం సముచితమా అని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు 2022లో 10 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) రిజర్వేషన్‌ను సమర్థించిన తీర్పు నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆ తీర్పులో క్రీమీ లేయర్ భావనను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు కూడా విస్తరించాలని కొందరు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఈ కేసు తీర్పు రిజర్వేషన్ వ్యవస్థలో కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది.

