కలం, మెదక్ బ్యూరో: ఓఆర్ఆర్ లోపలి రైతుల భూములను వెంటనే రెసిడెన్షియల్ జోన్లుగా మార్చాలని బీజేపీ (BJP) సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను జీహెచ్ఎంసీ పరిధిలోని బీజేపీ జిల్లా అధ్యక్షుల బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. నష్టపోతున్న పేద రైతులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌తో పేదలకు అన్యాయం: గోదావరి
ఈ సందర్బంగా బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ జోనింగ్ వ్యవస్థ పేరుతో గత 13 సంవత్సరాలుగా పేద, అమాయక రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోని 1355 రెవెన్యూ గ్రామాల్లో ఉన్న సుమారు 50 వేల మంది పేద రైతుల పాలిట ప్రస్తుత HMDA మాస్టర్ ప్లాన్ ఒక శాపంగా మారిందని మండిపడ్డారు.
మాస్టర్ ప్లాన్ మార్చడం లేదు
2013లో రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ జోన్లలో గత 13 ఏళ్లుగా ఎలాంటి మార్పులు చేయకపోవడం దారుణమన్నారు. కార్పొరేట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములు రెసిడెన్షియల్, మల్టిపుల్ యూజ్ జోన్లలో ఉంటూ వారు బహుళ అంతస్తుల భవనాలు నిర్మించుకుంటుంటే.. పేద రైతుల భూములను మాత్రం ‘కన్జర్వేషన్ (వ్యవసాయ) జోన్’ పరిధిలో ఉంచి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిగా నిషేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమల భూములను మార్చుకోవడానికి హిల్ట్ పాలసీని తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, పేద రైతుల భూములను మాత్రం ‘వ్యవసాయ జోన్’ లోనే ఉంచి ఎందుకు కక్ష సాధిస్తోందని ప్రశ్నించారు. ఒకటి లేదా రెండు ఎకరాలు ఉన్న చిన్నకారు రైతు కూడా తన పిల్లల భవిష్యత్తు కోసం, సొంత అవసరాల కోసం ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.’ హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను తక్షణమే సమీక్షించి రైతులకు అనుకూలంగా జోన్లను మార్చాలని లోక్ భవన్ లో గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు.

