అంకురం కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాలో గర్భిణులు, బాలింతలు, శిశువుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అంకురం’(Ankuram) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు గర్భిణులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. గర్భిణులలో ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

ఎన్ఎంఆర్ సంఖ్యను సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయడమే ‘అంకురం’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక ప్రణాళికల ద్వారా గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. గర్భిణులకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలను ఎప్పటికప్పుడు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వైద్యాధికారులు పర్యవేక్షణ చేపట్టి, గర్భిణులు తప్పనిసరిగా అవసరమైన వైద్య చికిత్సలు పొందేలా చూడాలని అన్నారు. అలాగే ‘సంకల్ప్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి, నవజాత శిశువుల మరణాలను గత సంవత్సరంతో పోలిస్తే 50 శాతం తగ్గించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ‘అంకురం’ కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, వైద్యులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>