మానేరు బ్రిడ్జ్ సాధనకై కలెక్టరేట్ ఎదుట దీక్ష

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా మానేరు నది (Manair River)పై మైలారం మైసమ్మ గుట్ట నుంచి కరీంనగర్ సప్తగిరి కాలనీ వరకు బ్రిడ్జ్ (Bridge) నిర్మాణం చేయాలని భూ సాధన పోరాట కమిటీ అధ్యక్షుడు, యువ న్యాయవాది జక్కనపల్లి గణేష్ డిమాండ్ చేశారు. బ్రిడ్జ్ జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు చేపట్టిన నిరసన దీక్షకు హాజరై ప్రసంగించారు. గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల గ్రామాల ప్రజలకు జిల్లా కేంద్రానికి రోడ్డు మార్గం దూరంగా ఉండటం వల్ల విద్య, ఉపాధి అవకాశాలకు దూరమౌతున్నారన్నారు. మానేర్ నది చుట్టుపక్కల గ్రామాల రైతులు కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులు, పాలు జిల్లా కేంద్రానికి సరఫరా చేస్తారని, అందుకు రోడ్డు మార్గం సరిగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులు, కూలీలు, చిన్న తరహా వ్యాపారులు వారివారి పనులకు జిల్లా కేంద్రానికి రావడం కష్టంగా ఉందన్నారు. యాక్సిడెంట్, పాముకాటు, డెలివరీల వంటి అత్యవసర పరిస్థితులలో వైద్యశాలలకు చేరుకోవడం ఇబ్బందిగా ఉందన్నారు. గ్రానైట్ వ్యాపారులు, కొందరు బడాబాబుల ప్రయోజనం కోసం ఎలగందుల నుంచి యాస్వాడకు బ్రిడ్జి నిర్మాణం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారని ఆరోపించారు. ఎలగందుల నుంచి బ్రిడ్జి నిర్మించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలన్నారు. మానేరు నది నిర్మాణం సమయంలో ముంపు గ్రామాలతో పాటు, మానేరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భూములను దారాదత్తం చేసినట్టు గుర్తుచేశారు.

మూడు మండలాల ప్రజల డిమాండ్ మేరకు బ్రిడ్జి నిర్మాణం చేయకపోతే కేంద్ర మంత్రి బండి సంజయ్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇండ్లను ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హనుమజిపల్లి సర్పంచ్ అంజి రెడ్డి, మ్యాదరి శ్రీనివాస్, రైతు కూలి సంఘం నాయకుడు బామండ్ల రవీందర్, విలాసాగరం రామచంద్రం, స్వామి రెడ్డి, గడ్డం రాజేశ్వర్ రెడ్డి, జక్కనపల్లి సత్తయ్య, సుద్దాల రాజమల్లు, రంగనవేని తిరుపతి, జక్కనపల్లి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>