నకిలీ బంగారంతో ఫైనాన్స్ సంస్థకు టోకరా.. ముగ్గురు అరెస్ట్

​కలం, ఖమ్మం బ్యూరో: నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా నమ్మించి ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెడుతోంది ఓ ముఠా. మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ఖమ్మం (Khammam) సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎస్. రాజ్‌కుమార్ గౌడ్ బుధవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

​ఖమ్మంలో ముత్తుట్ గోల్డ్ లోన్ సంస్థలో నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు పొందినట్లు ముత్తుట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్ ఏసీపీ మహ్మద్ సర్వర్ పర్యవేక్షణలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడు ఇసంపల్లి సాయివంశీ (34)తో పాటు షేక్ మహబూబ్ (33), జూపల్లి రాము (35)లను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి సుమారు రూ. 4 లక్షల విలువైన 11 నకిలీ బంగారు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు.

​ఈ కేసులో కొక్కిరేణి సందీప్ (27), ముండాడ రామచందర్ (39) అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేసినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఈ కేసును శరవేగంగా ఛేదించడంలో చురుగ్గా వ్యవహరించిన ఎస్‌ఐ వంశీ, హెడ్ కానిస్టేబుల్ ఓం ప్రకాశ్‌లను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>