కలం, స్పోర్ట్స్ : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2027) సీజన్ కోసం యూపీ వారియర్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌ను తమ హెడ్ ఆఫ్ స్కౌటింగ్‌గా నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. వరుస వైఫల్యాల తర్వాత జట్టును బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గత నాలుగు సీజన్లలో యూపీ వారియర్స్ తీవ్రంగా నిరాశపరిచింది.
మొత్తం 33 మ్యాచుల్లో కేవలం 12 విజయాలు మాత్రమే సాధించింది. 2023 తొలి సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు వెళ్లిన ఈ జట్టు.. ఆ తర్వాత వరుసగా మూడేళ్లు గ్రూప్ స్టేజ్‌లోనే వెనుతిరిగింది. 2025, 2026 సీజన్లలో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.ఈ నేపథ్యంలో కొత్త ప్రతిభను వెలికి తీసేందుకు నీతూ డేవిడ్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఇటీవల బెంగళూరులో జరిగిన ఆఫ్-సీజన్ క్యాంప్‌లో ఆమె పాల్గొన్నారు. హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ నేతృత్వంలోని కోచింగ్ టీమ్‌తో కలిసి నీతూ పనిచేశారు. నీతూ డేవిడ్‌కు క్రికెట్ రంగంలో అపారమైన అనుభవం ఉంది. భారత మహిళల జట్టు సెలక్షన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆమె పనిచేశారు. ఆమె హయాంలోనే భారత్ వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది. అలాగే 1995 నుంచి 2008 వరకు భారత్ తరఫున 10 టెస్టులు, 97 వన్డేలు ఆడి 182 వికెట్లు తీశారు. 1995లో వెస్టిండీస్‌పై ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు.

