రేవంత్ బాటలో మోడీ.. ఆరు గ్యారంటీల జపం..

కలం, నేషనల్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల (Telangana Six Guarantees) అమలులో విఫలమైందంటూ బీజేపీ తరచూ విమర్శలు చేస్తున్నది. ఓట్ల కోసమే మాయ మాటలు చెప్పి గ్యారంటీలతో మభ్య పెడుతున్నదని కూడా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పలుమార్లు విమర్శించారు. ఆరు గ్యారంటీలు ఒక మాయ అని వ్యాఖ్యానించిన బీజేపీ ఇప్పుడు అదే రాగాన్ని అందుకున్నది. తెలంగాణ కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన తరహాలోనే బీజేపీ ఇప్పుడు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీలను (BJP Six Guarantees) ప్రకటించింది. స్వయంగా ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలోని ఎన్నికల క్యాంపెయిన్‌లో భాగంగా మేదినీపూర్ జిల్లా హల్దియాలో జరిగిన సభలో ఆరు గ్యారంటీల ప్రస్తావన తెచ్చారు. కాంగ్రెస్ బాటనే బీజేపీ ఎంచుకున్నది. రేవంత్‌రెడ్డి ఆలోచననే మోడీ కూడా అందుకున్నారు.

ఆరు గ్యారంటీలు ఓ సక్సెస్ ఫార్ములా :

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీలే కీలకమని అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ పలు సందర్భాల్లో బహిరంగంగానే కామెంట్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును మాత్రం రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఒక పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు మేనిఫెస్టో ద్వారా ఇచ్చే గ్యారంటీలు కారణమవుతాయని బీజేపీ పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది. మోడీ (PM Modi) పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌లో ఆరు గ్యారంటీల (BJP Six Guarantees) ప్రస్తావన చేయడం ఇందుకు బలం చేకూర్చినట్లయింది. నిన్నమొన్నటివరకూ విమర్శించిన ఆరు గ్యారంటీలే ఇప్పుడు బీజేపీకి కూడా ఎన్నికల అస్త్రాలుగా మారాయి. కాంగ్రెస్‌ను విమర్శించడానికి ఆరు గ్యారంటీలను ఎంచుకున్న బీజేపీ ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో పవర్‌లోకి రావడానికి కీలకమైనవిగా భావించింది.

ఇక్కడ సంక్షేమం.. అక్కడ వాగ్ధానం.. :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రకటిస్తే బెంగాల్ ఎన్నికల సందర్భంగా మాత్రం బీజేపీ ఆ పేరుతో వాగ్ధానాలను ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గ్యారంటీలతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కే ఎల్పీజీ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (ఇండ్లకు), ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు, రైతు బీమా, రైతుభరోసా, సన్నవడ్లకు (క్వింటాల్‌కు) రూ. 500 బోనస్.. ఇలాంటి సంక్షేమాన్ని అందిస్తున్నది. బెంగాల్‌లో బీజేపీ మాత్రం ఆరు గ్యారంటీల పేరుతో మమతా బెనర్జీ ప్రభుత్వానికి మంగళం, పాలనా వ్యవస్థలో జవాబుదారీగా ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలపై నేరాలకు సంబంధించిన పాత కేసుల విచారణను రీ-ఓపెన్ చేయడం, అవినీతికి పాల్పడినవారిని జైళ్ళకు పంపడం, అక్రమ శరణార్ధులపై చట్టపరమైన చర్యలు… ఇలాంటివాటిని ప్రస్తావించారు.

తెలంగాణ పథకాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ :

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను బీజేపీ నిశితంగా గమనిస్తున్నది. ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలకు ప్రజల్లో ఉన్న ఆదరణను కూడా గమనిస్తున్నది. అందులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘రైతు డిస్కమ్’ కూడా ఒకటి. తెలంగాణలో ఇప్పటికే రెండు డిస్కమ్‌లు (ఉత్తర, దక్షిణ) ఉండగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విద్యుత్ పంపిణీకి (వ్యవసాయ పంపుసెట్లు, మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టుల లిఫ్టు పంపులు..) ప్రత్యేకంగా విడిగా రైతు డిస్కమ్ పేరుతో కొత్త వ్యవస్థకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. డిస్కమ్ లాంఛనంగా ఉనికిలోకి వచ్చినా పూర్తిస్థాయి ఫంక్షనింగ్ కోసం విధివిధానాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఇదే బాటలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోనూ వ్యవసాయ అవసరాల కోసం విడిగా డిస్కమ్‌లను ఏర్పాటు చేసేలా ఆ రాష్ట్రాల క్యాబినెట్‌లు నిర్ణయం తీసుకున్నాయి. త్వరలో లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.

ఒకవైపు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆరు గ్యారంటీల అమలు నత్తనడక అంటూ బీజేపీ విమర్శలు చేస్తూనే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆరు గ్యారంటీలు’ ప్రస్తావన చేసింది. స్వయంగా ప్రధాని మోడీ పబ్లిక్ మీటింగ్‌లో ప్రకటించడం గమనార్హం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రైతు డిస్కమ్’ విధానాన్ని కూడా బీజేపీ అందిపుచ్చుకుని అది అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో క్యాబినెట్ ఆమోదంతో శ్రీకారం చుడుతున్నది.

Read Also: ఫోన్లు వదలని పిల్లలు.. పేరెంట్స్​కు పరీక్ష

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>