కలం, వరంగల్: వరంగల్(Warangal) నగరంలోని పలు బంగారు ఆభరణాల దుకాణాలపై భారతీయ ప్రమాణాల సంస్థ (BIS) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) నంబర్ లేకుండా విక్రయానికి ఉంచిన బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలలో భాగంగా సుమారు 8 కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి మార్కెట్ విలువ దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హాల్‌మార్కింగ్ నిబంధనలను ఉల్లంఘించి హెచ్‌యూఐడీ నంబర్ లేకుండా బంగారు ఆభరణాల విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో.. హైదరాబాద్ నుంచి వచ్చిన BIS అధికారులు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిసింది. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. వినియోగదారులు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా BIS హాల్‌మార్క్‌తో పాటు HUID నంబర్‌ను పరిశీలించాలని సూచించారు. బంగారం నాణ్యత, వినియోగదారుల రక్షణ కోసం హాల్‌మార్కింగ్ నిబంధనలు పాటించడం తప్పనిసరని అధికారులు స్పష్టం చేశారు.

