ఖమ్మం రైల్వే స్టేషన్‌లో గంజాయి కలకలం.. ఒకరి అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు(Excise Officials) శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ఫామ్‌-1 సమీపంలోని ఆటో స్టాండ్ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 1.5 కేజీల ఎండు గంజాయితో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) ఆర్. కిషన్ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్ఐ సిహెచ్. శ్రీహరిరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఈ దాడులు నిర్వహించింది.

బ్యాగ్‌లో గంజాయి గుర్తింపు

ఆటో స్టాండ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒడిశాకు చెందిన కె. సింహాద్రిరావును అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా అందులో 1.5 కేజీల ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో గంజాయితో పాటు నిందితుడి సెల్‌ఫోన్‌ను కూడా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి, ఇతర సొత్తు విలువ సుమారు రూ.85 వేలుగా అధికారులు అంచనా వేశారు.

ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు

నిందితుడిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం తదుపరి సమగ్ర విచారణ నిమిత్తం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న గంజాయి, సెల్‌ఫోన్ తదితర సొత్తును ఖమ్మం-1 ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, డ్రైవర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అక్రమ మాదకద్రవ్యాల రవాణాపై నిఘా కొనసాగుతుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>