కలం, నల్లగొండ బ్యూరో : ప్రపంచం మెచ్చే ‘పోచంపల్లి ఇక్కత్’ (Pochampally Ikkat) రంగుల వెనుక.. ఆ రంగులను అద్దే నేతన్నల జీవితాలు వెలవెలబోతున్నాయి. పట్టుచీరల జిలుగుల కోసం వాడుతున్న రసాయనాలు వారి చర్మాన్ని దహించేస్తుండగా, గంటల తరబడి మగ్గంపై వంగి చేసే పని వారి వెన్నుముకను విరిచేస్తోంది. కళకు కాణాచి అయిన పోచంపల్లి (Pochampally) లో నేడు చేనేత కార్మికులు రోగాల కోరల్లో చిక్కుకుని వైద్యం కోసం అలమటిస్తున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి కార్మికులు దశాబ్దాలుగా చేనేత వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరి చేనేత కళ వల్లే ప్రపంచస్థాయిలో భూదాన్ పోచంపల్లితో పాటు తెలంగాణకు సైతం మంచి గుర్తింపు వచ్చింది.
ఇక్కడ తయారు అయ్యే చీరలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడి కార్మికుల ఆరోగ్య సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నారు. చేనేత ఇక్కత్ చీరల తయారీలో వినియోగించే రసాయనాలు, గంటల తరబడి మగ్గంపై కూర్చోవడం వల్ల వెన్నెముక, శ్వాసకోశ వ్యాధులతో అల్లాడిపోతున్నారు. అయితే ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందించేందుకు చర్మ, కంటి వైద్య నిపుణులను నియమించాలని ఏండ్ల తరబడి అధికారులను వేడుకుంటున్నా.. ఫలితం ఉండడం లేదు.
600 కుటుంబాలకు చేనేత వృత్తి ఆధారం..
భూదాన్‌పోచంపల్లిలో దాదాపు 600 కుటుంబాలు సాంప్రదాయ పిట్ లూమ్స్ (గుంట మగ్గాల)పై ఇక్కత్ చీరలను నేస్తూ జీవనం సాగిస్తున్నాయి. అయితే వీరంతా టై-అండ్-డై (కట్టు-అచ్చు) ప్రక్రియలో, మగ్గం పనుల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతుండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా మగ్గాలపై గంటల తరబడి కూర్చోవడం వల్ల తీవ్రమైన వెన్నునొప్పి, కండరాల నొప్పులు వస్తున్నాయి. వీటితో పాటు రంగులు అద్దే ప్రక్రియలో రసాయన రంగులు, యాసిడ్లను నేరుగా చేతులతో తాకడం వల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయి. నాణ్యత దెబ్బతింటుందనే కారణంతో ఇక్కడి చేనేత కార్మికులు గ్లౌజులు వాడటం లేదు. నూలు, దుమ్ము, రసాయన వాసనల వల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఎదురవుతున్నాయి. మరోవైపు ఏకాగ్రతతో చేసే నేత పని వల్ల కంటి చూపు మందగిస్తోంది.
ప్రభుత్వం పట్టించుకుంటేనే భవిష్యత్తు..
ఐక్యరాజ్యసమితి ద్వారా ఉత్తమ పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లి గుర్తింపు పొందింది. అయితే ఆ ఖ్యాతికి కారణమైన నేతన్నల బతుకులు మాత్రం ఇంకా చీకటిలోనే మగ్గిపోతున్నాయి. ప్రభుత్వం కేవలం అవార్డులతో సరిపెట్టకుండా వారి ఆరోగ్యానికి భద్రత, శ్రమకు తగిన ఫలితం అందిస్తేనే ఈ రంగుల ‘ఇక్కత్’ (Pochampally Ikkat) కళ భవిష్యత్ తరాలకు అందుతుంది. అయితే రసాయన రంగుల వల్ల చర్మ వ్యాధులు, గాలిలో ఉండే నూలు దుమ్ము వల్ల శ్వాసకోశ సమస్యలు, నిరంతరం మగ్గంపై వంగి పని చేయడం వల్ల వెన్నుముక సమస్యలు సర్వసాధారణం అయ్యాయి. చేనేత కార్మికుల కోసం క్లస్టర్ స్థాయిలో ప్రత్యేక వైద్యశాలలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఆదాయం తక్కువగా ఉండడం.. శారీరక శ్రమ ఎక్కువగా ఉండటంతో నేతన్నల పిల్లలు ఈ వృత్తిని వదిలి నగరాలకు వలసబాట పడుతున్నారు. దీంతో పోచంపల్లికే ప్రత్యేక మైన ఇక్కత్ కళ క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికుల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్‌లను అందుబాటులోకి ఉంచితేనే బెటర్. మరోవైపు చేనేత కార్మికులకు త్రిఫ్ట్ ఫండ్ వంటి పరిమిత ప్రయోజనాలే అందుతున్నాయి. వృత్తిపరమైన వ్యాధులకు ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ కింద చికిత్స అందడం లేదని, వెంటనే పోచంపల్లి పీహెచ్‌సీలో ప్రత్యేక చికిత్సా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: పెట్రోల్ ధరలు తగ్గే ఛాన్స్ లేదు: పవన్ ఖేరా
Follow Us On: Youtube

